ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో రెచ్చిపోతున్నారు. తాజాగా వాణిజ్య ప్రకటనల బిల్‌బోర్డులను లక్ష్యంగా చేసుకుని, రహదారుల పక్కన ఉండే డిజిటల్ స్క్రీన్లపై అశ్లీల వీడియోలను ప్రదర్శించి ఐదు దేశాల్లో తీవ్ర కలకలం సృష్టించారు. ఈజిప్ట్, మలేసియా, బ్రెజిల్, చైనా, ఇరాక్ దేశాల్లో జరిగిన ఈ వింత ఘటనలు అంతర్జాతీయంగా ఇంటర్నెట్ వ్యవస్థల భద్రతపై సరికొత్త ఆందోళనలను రేకెత్తించాయి.
ఈజిప్ట్ రాజధాని కైరోలోని అత్యంత రద్దీగా ఉండే ఒక ప్రధాన రహదారిపై అమర్చిన పెద్ద డిజిటల్ బిల్‌బోర్డుపై గత వారం అకస్మాత్తుగా అశ్లీల దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. అటువైగా వెళ్తున్న వాహనదారులు, ప్రజలు ఈ దృశ్యాలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ తర్వాత మలేసియాలోని జోహార్, బ్రెజిల్‌లోని కాంపో మాయోర్లో ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లపై కూడా ఇదే తరహాలో అశ్లీల వీడియోలు ప్లే అయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.
ఈ సైబర్ దాడులకు తామే కారణమంటూ ‘టెలిగ్రామ్ లీకర్స్’ అనే హ్యాకర్ల బృందం ప్రకటించింది. చైనా, ఇరాక్‌లలోని బిల్‌బోర్డులను కూడా తామే టార్గెట్ చేశామని వారు స్పష్టం చేశారు. డిజిటల్ ప్రకటనల మౌలిక సదుపాయాలలో ఉన్న భద్రతా లోపాలను బహిర్గతం చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని హ్యాకర్లు పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటనలపై ఆయా దేశాల సైబర్ సెక్యూరిటీ విభాగాలు లోతైన దర్యాప్తు జరుపుతున్నాయి.














