ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్ద కాలం పాటు చక్రం తిప్పిన నేత, వైఎస్సార్‌సీపీలో నంబర్ టూగా వెలుగొందిన మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ఎట్టకేలకు తన కొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. బుధవారం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు విజయవాడ వేదికగా ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. తెలుపు, కాషాయ రంగుల మధ్య ధర్మచక్రం ఉన్న జెండాను ఆవిష్కరించి, రాష్ట్రంలోని రెండు కుటుంబాల ఆధిపత్యానికి ముగింపు పలుకుతామని, 2029 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని భారీ ప్రకటనలే చేశారు.
అయితే, ఆ స్థాయి సీనియర్ నేత, జాతీయ రాజకీయాల్లో సైతం సుపరిచితుడైన సాయిరెడ్డి కొత్త పార్టీ పెడితే తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేగాలి. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించింది. సాధారణంగా ఏపీలో ఒక కొత్త పార్టీ ఆవిర్భవిస్తోందంటే మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో రోజుల తరబడి ప్రత్యేక చర్చలు, డిబేట్లు నడుస్తాయి. కానీ, విజయసాయిరెడ్డి పార్టీ ఆవిర్భావ సభ మాత్రం ఏదో ఒక సాధారణ ప్రెస్ మీట్ లేదా రొటీన్ వార్తలా ముగిసిపోయిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ప్రధాన న్యూస్ ఛానెళ్లు కొన్ని నిమిషాల పాటు లైవ్ కవరేజీ ఇచ్చి చేతులు దులుపుకున్నాయే తప్ప, ఆ తర్వాత దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక నేటి రాజకీయాలను శాసిస్తున్న డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియాలో అయితే సాయిరెడ్డి పార్టీ హడావుడి కనీస స్థాయిలో కూడా కనిపించలేదు. ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకోవడం అటుంచితే, కనీసం పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా దీనిపై ఆసక్తికర చర్చ జరగకపోవడం గమనార్హం. ఇంతటి భారీ పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న విజయసాయిరెడ్డి మీడియాను, ప్రజలను ఎందుకు ఆకట్టుకోలేకపోయారనే దానిపై విశ్లేషకులు పలు కారణాలను ప్రస్తావిస్తున్నారు.
మొదటిది, ఆయన గతంలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, మళ్లీ యూ-టర్న్ తీసుకుని పార్టీ పెట్టడం వల్ల ప్రజల్లో విశ్వసనీయత కొరవడింది. రెండోది, వైసీపీ హయాంలో కీలక నిర్ణయాల వెనుక ఉండి, ఇప్పుడు అవే పార్టీలపై విమర్శలు చేయడం, “రెండు కుటుంబాల ఆధిపత్యం” అంటూ కొత్త నినాదం ఎత్తుకోవడం జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అంతేకాకుండా, ఆయన వెంట చెప్పుకోదగ్గ మాస్ లీడర్లు కానీ, బలమైన క్యాడర్ కానీ లేకపోవడం వల్ల ఇది కేవలం ఒక వ్యక్తిగత ప్రయత్నంగానే మిగిలిపోయిందనే భావన ఏర్పడింది.
దీనికి తోడు, ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, ఇతర సంచలన అంశాలపై మీడియా పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టడం కూడా సాయిరెడ్డి పార్టీ వార్త మరుగున పడటానికి ఒక కారణమైంది. ఏదేమైనా, ఒకప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పి, మీడియా హెడ్‌లైన్స్‌లో నిలిచిన విజయసాయిరెడ్డి, సొంత పార్టీ పెట్టిన రోజున మాత్రం కనీస స్థాయి బజ్ కూడా క్రియేట్ చేయలేకపోవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాబోయే రోజుల్లో ఆయన ఏ మేరకు జనాల్లోకి వెళ్లి తన పార్టీ ఉనికిని చాటుకుంటారో వేచి చూడాలి.














