వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గత ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కెసిరెడ్డి, ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈడీ అధికారులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిద్దరూ బెయిల్‌పై బయట ఉంటే కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఈడీ తన పిటిషన్లో స్పష్టంగా పేర్కొంది.
మద్యం రవాణా టెండర్ల ప్రక్రియలో అక్రమాలు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై గత జూన్ నెలలో ఈడీ అధికారులు రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సెప్టెంబర్ 25న ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం వీరిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని, ఆధారాలను తారుమారు చేయకూడదని అప్పట్లో కోర్టు స్పష్టమైన షరతులు విధించింది. అయితే, నిందితులు బయట ఉండటం వల్ల విచారణ సజావుగా సాగదని భావించిన ఈడీ, కింది కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేసి, వారిని కస్టడీకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించింది.
ప్రస్తుతం ఈడీ దాఖలు చేసిన ఈ పిటిషన్ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ పిటిషన్ న్యాయస్థానంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటీవల వాసుదేవరెడ్డికి చెందిన బినామీ ఆస్తులు, బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేయగా, ఇప్పుడు ఈడీ ఏకంగా బెయిల్ రద్దు కోసం హైకోర్టు మెట్లెక్కడంతో ఈ కేసులో నిందితులకు ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. హైకోర్టు ఈ పిటిషన్‌పై ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.














