తమిళనాడులో అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీకి సొంత ఎమ్మెల్యేల ప్రవర్తన తలనొప్పిగా మారింది. పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులపై వస్తున్న వరుస ఆరోపణలు, వివాదాలపై ముఖ్యమంత్రి, టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 11న మహాబలిపురంలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరితో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి అందరు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇటీవల టీవీకే పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతల వ్యవహారశైలి రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపింది. కళ్లకురిచి టీవీకే ఎమ్మెల్యే సి. అరుళ్ విఘ్నేష్, ఆ జిల్లా మహిళా కలెక్టర్‌కు అసభ్యకరమైన వాట్సాప్ మెసేజ్‌లు పంపారని, మద్యం మత్తులో కలెక్టర్ నివాసానికి, కార్యాలయానికి వెళ్లి వేధించారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. అయితే, డీఎంకే ఎంపీ కనిమొళి చేసిన ఈ ఆరోపణలను అరుళ్ విఘ్నేష్ ఖండిస్తూ ఇవి కేవలం తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు. మరో ఘటనలో, తమిళనాడు డిప్యూటీ స్పీకర్ ఎం. రవిశంకర్ తన నియోజకవర్గంలోని ప్రాథమిక సమస్యల గురించి ప్రశ్నించిన ఒక వ్యక్తిని కారు దిగి మరీ అసభ్య పదజాలంతో దూషించి, దాడి చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వరుస ఘటనలతో ప్రధాన ప్రతిపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడిని పెంచాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా ఐసీయూలోకి వెళ్లాయని, పరిపాలన కోమాలోకి జారుకుందని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ మండిపడ్డారు. సొంత జిల్లా కలెక్టర్‌కే అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తుండటంతో కొత్తగా ఏర్పడిన విజయ్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామాలన్నింటినీ తీవ్రంగా పరిగణించిన సీఎం విజయ్, పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి ఎన్. ఆనంద్‌తో కలిసి ఎమ్మెల్యేలతో ఈ కీలక భేటీ నిర్వహించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వ్యవహారంపై పార్టీ అంతర్గత విచారణ జరుపుతుండగా, నేటి సమావేశంలో వారి నుంచి నేరుగా వివరణ కోరినట్లు సమాచారం. ప్రజలతోనూ, ప్రభుత్వ అధికారులతోనూ ప్రజాప్రతినిధులు అత్యంత హుందాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం విజయ్ ఈ సమావేశంలో గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించినా ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.






