ఏపీలో పల్లెల పండగకు మరో కీలక అడుగు..!

0
6

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సమరంలో అత్యంత కీలకమైన ఘట్టానికి తెరలేచింది. రాష్ట్రంలో ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్, షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో, తదుపరి అడుగుగా మండల, జిల్లా పరిషత్‌ల పాలకవర్గాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం..

ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 659 మండల పరిషత్‌లలో ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ మరుసటి రోజే, అంటే ఈ నెల 20వ తేదీన 28 జిల్లా పరిషత్‌లలో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. పరోక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. ఎంపీపీలలో ఒక్కొక్కరు, జడ్పీలలో ఇద్దరు చొప్పున మైనారిటీ వర్గాలకు చెందిన కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను అధికారులు పూర్తి చేయనున్నారు.

ఈ పరోక్ష ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ ఒక ముఖ్యమైన నిబంధనను స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్స్-అఫీషియో సభ్యులుగా హాజరుకావడానికి వీలున్నప్పటికీ, వారికి అధ్యక్ష, ఛైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉండదు. కేవలం ప్రజల చేత నేరుగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకుని మండల, జిల్లా పరిషత్ బాస్‌లను ఎన్నుకుంటారు. ఈ పరోక్ష ఎన్నికలు చేతులెత్తే విధానంలో జరుగుతాయని, ఇందులో రాజకీయ పార్టీలు జారీ చేసే ‘విప్’ నిబంధనలు ఖచ్చితంగా వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.