ఏపీ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయాలు..!

0
7

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఈ రోజు జరిగిన భేటీలో రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలా 30కి పైగా అత్యంత కీలకమైన అజెండా అంశాలకు మంత్రివర్గం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చేలా రాబోయే ఐదేళ్ల కాలానికి (2026-31) గానూ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ పాలసీ ప్రతిపాదనతో పాటు, 2036 వరకు దీర్ఘకాలిక లక్ష్యంతో రూపొందించిన ‘రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీ’ ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సాంకేతిక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా ‘సెమీకండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ-4.0’లో పలు కీలక సవరణల ప్రతిపాదనకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా భారీ పారిశ్రామిక పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లా అమనాంలో రూ. 31,387 కోట్ల భారీ పెట్టుబడితో 512 మెగావాట్ల సామర్థ్యం గల ‘ఏఐ డేటా సెంటర్ల’ ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. అలాగే రాంబిల్లిలో రూ. 570.20 కోట్ల పెట్టుబడితో ‘ఈప్యాక్ డేటా సెంటర్ యూనిట్’ ఏర్పాటుకు, తిరుపతిలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ‘డిక్సన్ టెక్నాలజీస్’కు అదనపు భూకేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

వీటితో పాటు అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల విస్తీర్ణంలో ‘ఫుట్‌వేర్ కాంపోనెంట్ పార్కు’, ఎన్టీఆర్ జిల్లా జయంతిపురంలో 30 ఎకరాల విస్తీర్ణంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘F L O మహిళా పారిశ్రామిక పార్కు’ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న రహదారి ప్రమాదాల నివారణకు, రద్దీ నియంత్రణకు ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖ పరిధిలో అత్యంత పటిష్టమైన విధానాలతో పనిచేసేలా ‘ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్’ ఏర్పాటు ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సరికొత్త విభాగం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రహదారి భద్రతా ప్రమాణాలను పెంచడంతో పాటు ఆధునిక సాంకేతికతతో ట్రాఫిక్ వ్యవస్థను పర్యవేక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విజయపరంపర నేపథ్యంలో జరిగిన ఈ కేబినెట్ భేటీ.. రాష్ట్రాభివృద్ధికి సరికొత్త దిశా నిర్దేశం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.