అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రిటీష్ వార్తా పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ఒక మైండ్ బ్లోయింగ్ కథనాన్ని ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధాన మంత్రి బెన్జమిన్ నెతన్యాహు ప్రతిరోజూ ఫోన్ చేస్తున్నారనే షాకింగ్ విషయాన్ని ఈ పత్రిక బయటపెట్టింది. ఇరాన్‌పై తిరిగి సైనిక దాడులను ప్రారంభించాలని, ఆ దేశాన్ని పూర్తిగా దెబ్బతీయాలంటూ నెతన్యాహు నిరంతరం ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు శ్వేతసౌధం వర్గాల సమాచారంతో ఈ నివేదిక వెల్లడించింది. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు అరబ్ దేశాల అధినేతలు ప్రయత్నిస్తుంటే, నెతన్యాహు మాత్రం ‘మళ్లీ యుద్ధం చేద్దాం’ అంటూ రోజువారీ ఫోన్ కాల్స్‌తో ట్రంప్ మైండ్ మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఫైనాన్షియల్ టైమ్స్ విశ్లేషణ ప్రకారం, నెతన్యాహు ఈ ఇరాన్ యుద్ధాన్ని తన సొంత రాజకీయ లబ్ధి కోసం, కుర్చీని కాపాడుకోవడానికే వాడుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించడంలో విఫలమైంది. దేశీయంగా రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడటంతో పాటు తనపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఆయన ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల సహాయంతో ఇరాన్ పాలనను కూల్చివేసి, ఆ క్రెడిట్‌తో ఇజ్రాయెల్‌లో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలనేది నెతన్యాహు వ్యూహమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చినట్లు సమాచారం. ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడం, తద్వారా అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్‌లో తన పట్టును కోల్పోవాల్సి రావడంతో ట్రంప్ ఇప్పుడు వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారు. యుద్ధాన్ని ముగించి చర్చల వైపు వెళ్లడమే మంచిదని ట్రంప్ భావిస్తుండగా, నెతన్యాహు మాత్రం రోజూ ఫోన్ చేస్తూ దాడులను పునఃప్రారంభించాలని కోరుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, మరియు టర్కీ వంటి ప్రాంతీయ అరబ్ దేశాల అధినేతలు సైతం ట్రంప్‌నకు ఫోన్ చేసి.. నెతన్యాహు మాటలు విని యుద్ధాన్ని మరింత తీవ్రం చేయవద్దని, దౌత్యపరమైన చర్చలకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.














