కూటమి సీట్లను ముంచేసిన బీజేపీ బలవంతపు రాజకీయం..!

0
6

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార కూటమిలోని అంతర్గత డొల్లతనాన్ని, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయి బలహీనతను బట్టబయలు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించిన 76 జడ్పీటీసీ స్థానాల్లో.. బీజేపీ పోటీ చేసిన స్థానాలు అత్యధికంగా ఉండటం ఇప్పుడు కూటమిలో పెద్ద చర్చకు దారితీసింది. గజపతినగరం, పార్వతీపురం, పాడేరు, గన్నవరం, మేడికొండూరు, చీరాల, ముదిగుబ్బ, తాడిమర్రి వంటి పలు రూరల్ ఏరియాల్లో బీజేపీ అభ్యర్థులు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.

ఈ ఫలితాలను విశ్లేషిస్తే, గ్రామీణ స్థాయిలో అసలు క్యాడర్ లేని బీజేపీ, కేవలం సీట్ల కోసం పట్టుబట్టి కూటమికి తీరని నష్టం చేకూర్చిందనేది స్పష్టమవుతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ, రూరల్ లెవెల్‌లో ఆ పార్టీకి కనీస బలం లేదు. చాలా గ్రామాల్లో పార్టీ బోర్డులు గానీ, జెండాలు మోసే కార్యకర్తలు గానీ కనిపించని పరిస్థితి. అయినప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటులో పొత్తు ధర్మం పేరుతో బీజేపీ నేతలు తమ బలానికి మించి గ్రామీణ స్థానాలను బలవంతంగా దక్కించుకున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇలాగే రూరల్ టచ్ ఉన్న కొన్ని అసెంబ్లీ స్థానాలను బీజేపీ పట్టుబట్టి తీసుకోవడం, అక్కడ ఓడిపోవడం లేదా చాలా తక్కువ మెజారిటీతో బయటపడటం జరిగింది. ఇప్పుడు అదే తప్పును స్థానిక ఎన్నికల్లోనూ పునరావృతం చేసి, గెలిచే అవకాశమున్న సీట్లను వైకాపా చేతుల్లో పెట్టారు. ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి సరైన మద్దతు లభించకపోవడమేనని తెలుస్తోంది.

“రూరల్ లెవెల్‌లో మాకు ఓటు బ్యాంకు లేదు, మా వెనుక నడిచే కార్యకర్తలు లేరు.. అంతా టీడీపీ క్యాడర్ పైనే ఆధారపడాలి. కానీ గ్రౌండ్‌లో టీడీపీ నేతలు మాకు అస్సలు సహకరించడం లేదు” అని బీజేపీ అభ్యర్థులు అంతర్గతంగా లబోదిబోమంటున్నారు. ఒకవైపు తమకు సొంత బలం లేకపోవడం, మరోవైపు క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపంతో టీడీపీ శ్రేణులు పని చేయకపోవడంతో బీజేపీ పోటీ చేసిన మెజారిటీ స్థానాల్లో వైకాపా సులభంగా జెండా ఎగరేయగలిగింది. మొత్తం మీద చూస్తే, తమకు పట్టు లేని చోట్ల కూడా కేవలం అహానికి పోయి, బలవంతంగా సీట్లు లాక్కోవడం వల్లే కూటమి ఇన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇప్పటికైనా బీజేపీ అగ్రనాయకత్వం వాస్తవాలను గ్రహించి, రూరల్ పాలిటిక్స్‌లో గ్రౌండ్ రియాలిటీని అంగీకరించకపోతే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూటమికి మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.