ద్రవిడ్, పుజారాలతో పోలికలపై దేవదత్ పడిక్కల్ సంచలన వ్యాఖ్యలు..!

0
11

భారత టెస్ట్ క్రికెట్ జట్టులో అత్యంత కీలకమైన నంబర్ 3 స్థానం ఎప్పుడూ హాట్ టాపిక్కే. గతంలో రాహుల్ ద్రవిడ్, ఛతేశ్వర్ పుజారా లాంటి దిగ్గజాలు బ్యాటింగ్ చేసిన ఈ పొజిషన్ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఈ ప్లేస్ కోసం టీమిండియాలో గట్టి పోటీ నడుస్తోంది. తాజాగా ఈ రేసుపై భారత యువ సంచలనం, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అత్యంత కీలకమైన, స్పష్టమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జట్టులో స్థానం నిలబెట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గం నిలకడగా రాణించడమేనని స్పష్టం చేసాడు.

ఇటీవల శ్రీలంక పర్యటనలో సాయి సుదర్శన్ అందుబాటులో లేని సమయంలో.. నంబర్ 3 పొజిషన్‌లో బరిలోకి దిగిన పడిక్కల్ బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలతో అదరగొట్టాడు. భారత్ 1-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో ద్రవిడ్, పుజారాల వంటి లెజెండ్స్‌తో వస్తున్న పోలికలపై పడిక్కల్ స్పందిస్తూ.. “దిగ్గజాలతో పోలికలు రావడం, నాపై మరింత నిఘా ఉండటం సహజం. కానీ నేను వాటి గురించి అస్సలు ఆలోచించను. నేను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా జట్టు విజయానికి నా వంతు సహకారం అందించడమే నా లక్ష్యం. నా ఆటను నేను ఆస్వాదిస్తున్నంత కాలం అన్నీ సవ్యంగానే జరుగుతాయి” అని ధీమా వ్యక్తం చేశాడు.

లాంగ్ ఫార్మాట్ బ్యాటింగ్‌లో ఎక్కువ గంటలు క్రీజులో ఎలా నిలదొక్కుకోవాలో మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చేసిన సంభాషణలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని పడిక్కల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. రాబోయే న్యూజిలాండ్ పర్యటనతో పాటు ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ’ సిరీస్‌ల నేపథ్యంలో పడిక్కల్ టీమిండియా భవిష్యత్తు రేసుపై ప్రాక్టికల్ గా మాట్లాడాడు. “ఈ రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశాలు చాలా పరిమితంగా వస్తున్నాయి, జట్టులో చోటు ఖాయం చేసుకోవడం అంత సులువు కాదు. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. కాబట్టి నిరంతరం పరుగులు సాధిస్తూ జట్టు విజయాల్లో భాగస్వామిని కావడం మాత్రమే నా చేతుల్లో ఉంది” అంటూ పడిక్కల్ తన క్లారిటీని ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.