పన్నీర్ పై FSSAI షాకింగ్ ఆదేశాలు..!

0
4

భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ దేశవ్యాప్తంగా పనీర్ ప్రియులకు, వినియోగదారులకు రక్షణ కల్పించేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో పాల పదార్థాలు లేకుండా, కేవలం వెజిటబుల్ ఆయిల్స్, స్టార్చ్, ప్లాంట్ ప్రొటీన్లు, వివిధ రకాల కెమికల్స్‌తో తయారు చేస్తున్న అనలాగ్ పనీర్ అమ్మకాలపై కఠిన నియంత్రణలు విధించేలా ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పనీర్ పేరుతో మార్కెట్లో సాగుతున్న ఈ మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్ర ఆహార నియంత్రణ సంస్థ ఈ చర్యలకు ఉపక్రమించింది.

ఈ నూతన ప్రతిపాదనల ప్రకారం, 100 శాతం స్వచ్ఛమైన పాలు లేదా పాల పదార్థాలతో తయారు చేయని ఏ ఉత్పత్తులకైనా ‘పనీర్’ అనే పేరును ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించనున్నారు. ఇప్పటికే ‘అనలాగ్ ఇన్ డెయిరీ కాంటెక్స్ట్’ కేటగిరీ కింద లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొంది, తమ ప్యాకెట్లపై ‘పనీర్’ అని ముద్రిస్తున్న సంస్థలు కూడా.. ఇకపై ఆ పేరును మార్కెటింగ్ కోసం కానీ, లేబ్లింగ్ కోసం కానీ వాడటానికి వీల్లేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు మరియు క్లౌడ్ కిచెన్లు కూడా మెనూ కార్డుల్లో తాము వాడేది ఒరిజినల్ పనీరా లేక అనలాగ్ పనీరా అనే విషయాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.

ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ప్రజలు, వ్యాపారులు మరియు భాగస్వామ్య పక్షాల నుంచి సూచనలు, సలహాలు లేదా అభ్యంతరాలను తెలియజేయడానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 60 రోజుల గడువు ఇచ్చింది. ఈ గడువు ముగిసిన తర్వాత అందే అభిప్రాయాలను సమీక్షించి, దేశవ్యాప్తంగా ఈ నిబంధనలను అధికారికంగా అమలు చేయనున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి దాదాపు ఎనిమిది రాష్ట్రాలు ‘అనలాగ్ పనీర్’ అమ్మకాలపై స్థానికంగా చర్యలు తీసుకోగా, ఇప్పుడు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా వినియోగదారులు మోసపోకుండా నాణ్యమైన ఆహారాన్ని పొందే అవకాశం లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.