దేశవ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీన మొబైల్ వ్యాపారులు, చిన్న రిటైలర్లు నిర్వహించ తలపెట్టిన భారీ నో యూపీఐ డే నిరసన కార్యక్రమం రద్దయింది. రూ. 2,000 దాటిన ప్రతి మర్చంట్ డిజిటల్ లావాదేవీపై అక్టోబర్ 15 నుండి 0.4 శాతం మేర మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను అమలు చేయాలనే నయా ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అఖిల భారత మొబైల్ రిటైలర్ల అసోసియేషన్, ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ లతో కూడిన 20కి పైగా ట్రేడ్ అసోసియేషన్లు ఈ పిలుపునిచ్చాయి.
అయితే, పండుగల సీజన్ ముంగిట ఈ నిరసన వల్ల డిజిటల్ చెల్లింపులకు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఈ నేపథ్యంలో, బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ నేతృత్వంలోని వ్యాపార సంఘాల ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో న్యూఢిల్లీలో అత్యవసరంగా భేటీ అయింది. ఇప్పటికే అతి తక్కువ లాభాల మార్జిన్‌తో నడుస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలపై ఈ 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు నెలకు దాదాపు రూ. 40 కోట్ల అదనపు భారాన్ని మోపుతాయని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న రూ. 1 లక్ష నెలవారీ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని, మర్చంట్-టు-మర్చంట్ లావాదేవీలకు దీని నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. వ్యాపారుల సమస్యలను సావధానంగా విన్న ఆర్థిక మంత్రి.. ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని గట్టి భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నుండి లభించిన హామీల నేపథ్యంలో.. అక్టోబర్ 2న చేపట్టాల్సిన నో యూపీఐ డే దేశవ్యాప్త నిరసనను ఉపసంహరించుకుంటున్నట్లు AIMRA మరియు AICPDF సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.














