ఐపీఎల్ 2027 మినీ వేలానికి సమయం దగ్గరపడుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలో తీవ్ర కలకలం రేగుతోంది. గత కొన్ని సీజన్లుగా ఆరెంజ్ ఆర్మీ విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ, తన మెరుపు బ్యాటింగ్‌తో ఉప్పల్ స్టేడియాన్ని ఊపేసిన స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టు అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు జాతీయ మీడియా చెప్తోంది. మేనేజ్‌మెంట్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా ఆయన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను వీడాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ అంతర్గత వివాదానికి ప్రధాన కారణం కెప్టెన్సీ పీఠమే అని తెలుస్తోంది. రాబోయే సీజన్‌కు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటుపై సందిగ్ధత నెలకొనడంతో, కొత్త నాయకుడి ఎంపికపై ఫ్రాంచైజీ కసరత్తు చేస్తోంది. 2019 నుండి జట్టుతోనే ఉంటూ నిలకడగా రాణిస్తున్న తనకు కెప్టెన్సీ దక్కుతుందని అభిషేక్ శర్మ ఆశించాడు. అయితే, మేనేజ్‌మెంట్ ఊహించని విధంగా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను కెప్టెన్‌గా ప్రకటించడానికి మొగ్గు చూపినట్లు ఇన్సైడ్ టాక్.
జట్టులో తనకంటే జూనియర్ అయిన ఇషాన్ కిషన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడాన్ని అభిషేక్ శర్మ జీర్ణించుకోలేకపోతున్నాడని, ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్ల మధ్య ఈగో వార్ ముదరడంతోనే ఆయన జట్టు మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఐపీఎల్ 2026 సీజన్‌లో 198 కి పైగా స్ట్రైక్ రేట్‌తో, 43 సిక్సర్లతో ఏకంగా 563 పరుగులు సాధించిన అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న హాటెస్ట్ ప్రాపర్టీ.
ఒకవేళ ఫ్రాంచైజీతో గొడవలు సర్దుమణగక అతను వేలంలోకి వస్తే లేదా ట్రేడింగ్ విండో ద్వారా బయటకు వస్తే దక్కించుకోవడానికి ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ వంటి బడా జట్లు భారీ ఆఫర్లతో సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ అతని కోసం భారీ క్యాష్ డీల్ చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తోంది. ప్రస్తుతానికి ఎస్ఆర్‌హెచ్ సీఈవో కె. షణ్ముగం ఈ వార్తలను ఖండించినప్పటికీ, మెగా వేలానికి ముందే హైదరాబాద్ క్యాంప్‌లో మొదలైన ఈ లొల్లి ఆరెంజ్ ఆర్మీ అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.














