కెటిఆర్ అరెస్ట్‌కు టైం దగ్గర పడిందా..?

0
1

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా ఊగిసలాడుతున్న ఫార్ములా-ఈ కార్ రేసింగ్ నిధుల మళ్లింపు కేసు ఇప్పుడు అత్యంత క్లైమాక్స్ దశకు చేరుకుంది. నాంపల్లి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులను తక్షణమే జప్తు చేయాలంటూ జారీ చేసిన సంచలన ఆదేశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఈ పరిణామం కేవలం విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం మాత్రమే కాదు.. కేటీఆర్ అరెస్టుకు అవినీతి నిరోధక శాఖ అడుగులు వేగంగా వేస్తోందనడానికి బలమైన సంకేతమనే చర్చ జోరందుకుంది.

సాధారణంగా ఏ అవినీతి కేసులోనైనా దర్యాప్తు సంస్థలు నిందితుల పాస్‌పోర్టులను జప్తు చేయాలని కోర్టును ఆశ్రయించాయంటే.. సదరు నిందితులపై బలమైన సాక్ష్యాధారాలు లభ్యమయ్యాయని, వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందని అర్థం. నిందితులు విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకే ఏసీబీ కోర్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ కు లేఖ రాసింది. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ₹55 కోట్ల ప్రభుత్వ నిధులను ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహణ సంస్థకు మళ్లించారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఇప్పటికే పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కేటీఆర్‌పై చట్టపరమైన పట్టు బిగించేందుకు పాస్‌పోర్ట్ జప్తు అస్త్రాన్ని ప్రయోగించారనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు స్పీడ్ పెంచడం, చార్జ్‌షీట్ నమోదు చేయడం, ఇప్పుడు నేరుగా కోర్టు ద్వారా పాస్‌పోర్టుల సీజ్‌కు ఆదేశాలు రావడం చూస్తుంటే కేటీఆర్‌కు లీగల్ గా ఊరట దక్కే అవకాశాలు క్షిణించినట్లు కనిపిస్తోంది.

కోర్టు ఆదేశాల తదుపరి పరిణామంగా ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉందని, సాక్ష్యాల ఆధారంగా ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేందుకు కూడా వెనుకాడకపోవచ్చని లీగల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఈ చర్యలను రాజకీయ కక్షసాధింపుగా కొట్టిపారేస్తున్నప్పటికీ.. కోర్టు స్వయంగా ఆదేశాలు జారీ చేయడంతో కేటీఆర్‌కు ఇప్పట్లో ఈ గండం నుంచి బయటపడటం అంత సులువు కాదని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ చుట్టూ తిరుగుతున్న ఈ లీగల్ లూప్ హోల్స్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.