సినిమాల్లో టెక్నాలజీ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా నిర్మాణంలోనే కాదు.. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్‌లో కూడా భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఏఐ వచ్చాక ఏది నిజమో, ఏది కల్పితమో సామాన్యులు తెలుసుకోలేని పరిస్థితి. ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ, మార్ఫ్ డ్ వీడియోలు, వాయిస్ లు తయారు చేసి సోషల్మీడియాలో వదులుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ మీద ఇలాంటి అసభ్యకరమైన వీడియో చేసి సోషల్మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు.
దేవర సినిమాలో పాపులర్ అయిన ఒక పాటకు సంబంధించిన దృశ్యాలతో మార్ఫింగ్ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇందులో జాన్వీకపూర్ ని అసభ్యకరంగా చూపిస్తూ, మార్పులు చేశారు. ఒరిజినల్ దృశ్యాలను ఏఐతో మార్చి డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేశారు. దీని మీద జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు. “మహిళలను తల్లిగా, దేవతలుగా పూజించే మన దేశంలో.. “మాతృదేవోభవ” అనేది కేవలం ఒక మాట కాదు, మన సంస్కృతిలో భాగం. అలాంటి సమాజంలో కొందరు ఇంతగా దిగజారి.. ఒక మహిళను అత్యంత నీచంగా అవమానించే విధంగా AIని ఉపయోగించడం దారుణం.
ఇలాంటి జుగుప్సాకరమైన కంటెంట్‌ను రూపొందించడానికి AIని ఉపయోగించడం సిగ్గుచేటు. ఈ వీడియో వెనుక ఉన్న వ్యక్తులెవరినీ నేను వదిలిపెట్టను. ఈ వీడియోను రూపొందించిన వారిపైనే కాకుండా, దాన్ని తయారు చేసి ప్రచారం చేస్తున్న వారిపైనా అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. దయచేసి ఇలాంటి కంటెంట్‌ను చూడకండి.. షేర్ చేయకండి.. ఎలాంటి విధంగానూ ఎంగేజ్ అవ్వకండి. ఈరోజు బాధితురాలు మరెవరో కావచ్చు.. రేపు మీ తల్లి, మీ సోదరి, మీ భార్య లేదా మీ కుమార్తె కావచ్చు. AI దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించి, పటిష్టమైన నియంత్రణలు తీసుకురావాలని నేను కోరుతున్నాను” అని ట్వీట్ చేశారు.
జాన్వీ కపూర్ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ మధ్య తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులమీద కూడా ఇలాంటి సెటైరికల్ వీడియో ఒకటి వైరల్ చేశారు. గతంలో ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో మహేష్ బాబు గెస్ట్‌గా వచ్చినప్పుడు.. ఎన్టీఆర్, మహేష్ మధ్య సరదా సంభాషణలు, ఒకరిపై మరొకరు వేసుకున్న పంచ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ ప్రశ్నలు అడుగుతుంటే.. మహేష్ తనదైన స్టైల్లో కౌంటర్లు ఇచ్చారు. మహేష్ బాబుతో జూనియర్ ఎన్టీఆర్ నిర్వహించిన ఒక క్విజ్ ప్రోగ్రామ్ లో ఆడియోని మార్చేశారు.
తెలంగాణని దోచుకున్నదెవరు..? వందల ఎకరాల ఫామ్ హౌస్ లు ఎవరికున్నాయి లాంటి ప్రశ్నలు ఎన్టీఆర్ అడిగితే వాటికి బిఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ పేర్లని మహేష్ చెప్తున్నట్టు మార్చి డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి వీడియోలు చేస్తే, కొన్నిసార్లు ఏమీ తెలియని జనం నమ్మే ప్రమాదం కూడా వుంది. ఏఐ వల్ల ఎంత ఉపయోగం వుందో అన్ని అనర్ధాలు కూడా వుంటాయి. ఇక్కడ చర్చ కేవలం జాన్వీ కపూర్ లేదా ఎన్టీఆర్‌కు సంబంధించినది కాదు. దీని వల్ల రాజకీయనాయకులు, సినీప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, విఐపిలకు ఇబ్బందులు తప్పవు.
ముఖ్యంగా రాజకీయ నాయకుల ఒరిజినల్ వీడియోలు తీసుకుని, దానికి వాళ్లు చెప్పని మాటలని జోడించి, తప్పుడు మాటలు మాట్లాడినట్టుగా ఆడియోలు సెట్ చేసి, ప్రత్యర్థులు ఇబ్బందిపెట్టే అవకాశం వుంది. అది అబద్ధమని, మార్ఫ్ డ్ అని తేలేలోపు ఈ వీడియో ప్రపంచమంతా తిరుగుతుంది. సామాన్యులకు కూడా ఇది ప్రమాదకరంగా మారుతుంది. దీని వల్ల కాపురాలు కూలిపోవచ్చు. ఉద్యోగాలు పోవచ్చు. అనవసరమైన అపార్ధాలు రావచ్చు. అసలు ఈ వీడియోలని ఇంత పకడ్పందీగా, అసలైనవే అనిపించేలా ఎలా తయారు చేస్తారని ఒక ఏఐ ఎక్స్ పర్ట్ చెప్పిన విషయాలు షాకింగ్ గా ఉన్నాయి.
“ఒక వ్యక్తికి సంబంధించిన ఒరిజినల్ ఫొటోలు లేదా వీడియోలను తీసుకుని.. AI ఆధారిత face replacement, image generation, video manipulation వంటి టెక్నాలజీలతో అసలు వీడియోలో లేని దృశ్యాలను సృష్టిస్తారు. ఆ తర్వాత వాటిని ఒరిజినల్ వీడియోతో కలిపి.. నిజంగా జరిగినట్టుగా కనిపించేలా ఎడిట్ చేయవచ్చని” చెప్పారు. ఇక్కడ టెక్నాలజీని తప్పు పట్టలేం. కానీ టెక్నాలజీని ఎవరు ఎలా ఉపయోగిస్తారన్నదే ప్రశ్న. టెక్నాలజీని దుర్వినియోగం చేసే వాళ్ల మీద కఠినచర్యలు తీసుకోవాలి. ఇలాంటి వీడియోలు తయారుచేసే వాళ్ల మీద, షేర్ చేసే వాళ్ల మీద కూడా చర్యలు తీసుకునేలా కఠిన చట్టాలు తీసుకురావాలి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలని షేర్ చేసే ముందు అందరూ అది ఒరిజినలా కాదా అని ఒక్కసారి కన్ఫామ్ చేసుకుని షేర్ చెయ్యాలంటున్నారు నిపుణులు.














