ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం.. సాంకేతిక పరంగా సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. “ఎక్కువ మంది పెర్ఫార్మర్లను రియల్ టైమ్‌లో ఏకకాలంలో మోషన్ క్యాప్చర్ చేసిన” చిత్రంగా ‘రాకా’ గ్లోబల్ రికార్డును సొంతం చేసుకుంది.
హాలీవుడ్ స్థాయి విజువల్స్, అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం మేకర్స్ సరికొత్త ప్రయోగం చేశారు. ఒకే సీన్ లో, రియల్ టైమ్‌లో ఏకకాలంలో ఏకంగా 37 మంది నటుల మోషన్ క్యాప్చర్‌ను లైవ్‌గా బంధించి ఈ అరుదైన ఘనతను సాధించారు. భారతీయ సినిమా చరిత్రలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో ఇంతటి భారీ ప్రయోగం జరగడం ఇదే ప్రథమం. ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తింపుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ నుంచి హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ స్వయంగా అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ బర్త్‌డే సందర్భంగా ‘రాకా’ మేకర్స్ విడుదల చేసిన ఈ అఫీషియల్ అప్‌డేట్ మరియు గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సినిమా విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో ‘రాకా’ ప్రభంజనం మొదలుకావడంతో అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.














