రాజకీయాల్లో ‘మీడియా అటెన్షన్’ సంపాదించడం ఎలాగో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని చూసి నేర్చుకోవాలి. ప్రెస్‌మీట్ పెట్టారు.. మైకులు ముందున్నాయి.. కానీ అసలు మ్యాటర్ అయిన పార్టీ పేరేంటో మాత్రం చెప్పలేదు. సినిమా ఇండస్ట్రీలో టీజర్లు, ట్రైలర్లు వదిలినట్లు.. ఈయన కూడా తన కొత్త పార్టీపై పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను నడిపిస్తున్నారు. అసలు పాయింట్ చెప్పకుండా, మీడియా అటెన్షన్ కోసం ఈ వయసులో ఆయన పడుతున్న కష్టాలు చూస్తుంటే ముచ్చటేస్తోందని రాజకీయ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు.
పార్టీ పేరు చెప్పకుండానే విజయసాయిరెడ్డి తన భవిష్యత్తు టూర్ షెడ్యూల్‌ను కూడా అనౌన్స్ చేసేశారు. ఇంకా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు ప్రెస్‌మీట్లు పెడతారట. తదుపరి అనంతపురం, ఆ తర్వాత విశాఖపట్నం, ఆపై తిరుపతి చుట్టేసి.. మొత్తానికి మీడియా మైకులన్నీ అరిగిపోయేలా మాట్లాడిన తర్వాత ఒక భారీ కాంక్లేవ్ నిర్వహిస్తారట. ఆ తర్వాతే ‘విజయదశమి’ మరుసటి రోజు శుభ ముహూర్తాన పార్టీ జెండా, అజెండా, పేరు ప్రకటిస్తానని సెలవిచ్చారు.
‘యువతతో కలిసి పార్టీ పెడతాను’ అంటూ జెన్-జీ స్లోగన్లు ఇస్తున్న ఈ సరికొత్త ‘యంగ్ లీడర్’.. తాము కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన ప్రాంతీయ పార్టీ అని ముందే క్లారిటీ ఇచ్చేసారు. ఇక అన్నిటికంటే హైలైట్ ఏంటంటే.. జగన్మోహన్‌రెడ్డి గారిపై సాయిరెడ్డి గారికి ఉన్న ఆ ‘అనంతమైన ప్రేమ’ మరోసారి ప్రెస్‌మీట్‌లో ఉప్పొంగిపోయింది. “జగన్మోహన్‌రెడ్డి నాకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే.. నా శత్రువు ఎంతమాత్రం కాదు.
ఆయనకు వ్యతిరేకంగా నేనేమీ కొత్త పార్టీ పెట్టలేదు” అంటూ సాయిరెడ్డి గారు ఇచ్చిన స్టేట్‌మెంట్ విన్న నెటిజన్లు ‘అబ్బబ్బా.. ఏం ప్రేమ.. ఏం నిలకడ’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ డిజైన్ చేస్తున్నారు. పార్టీ పెట్టేదేమో జగన్ పార్టీకి ఆల్టర్నేటివ్‌గా, కానీ జగన్ నా శత్రువు కాదు అని చెప్పడం చూస్తుంటే.. అటు వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లను చీల్చాలా..? లేక సానుభూతి సంపాదించాలా..? అనే కన్ఫ్యూజన్‌లో సాయిరెడ్డి గారు ఇంకా స్క్రిప్ట్ వర్క్ సరిగ్గా పూర్తి చేయలేనట్లుంది. ఏది ఏమైనా, విజయదశమి వరకు ఈ ‘సాయిరెడ్డి సస్పెన్స్ పాలిటిక్స్’ మీడియాకు మంచి టైమ్‌పాస్ స్టఫ్ అని చెప్పక తప్పదు.







