రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ మీద కొంతకాలంగా వైసిపి ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొదట డిఎస్సీ పేపర్ లీకయిందని గొడవ చేశారు. కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్ బ్యాంక్ నుంచి వచ్చే ప్రశ్నలు ప్రతి అభ్యర్ధికి మారతాయని తెలిశాక ఆ ఆరోపణని వదిలేశారు. ఆ తరువాత స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, కమ్మ కులస్థులకే ఎక్కువ ఉద్యోగాలిచ్చారని ప్రచారం చేశారు. ఒక రిటైర్డ్ ఐఎఎస్ కూడా అదే ఉద్ఘాటించి, ఆ తరువాత స్పోర్ట్స్ కోటా కులాల లెక్కలు బయటకొచ్చాక దాన్ని వదిలేశారు.
ఆ ఐఎఎస్ కూడా తన ఆరోపణ ఉపసంహరించుకున్నారు. ఆ తరువాత మాజీ మంత్రి పేర్ని నానీ బ్రిడ్జి గేమ్ గురించి తెలుసుకోకుండా, ఆ గేమ్ ఆసియా క్రీడల్లో కూడా వుందని తెలియకుండా, పేకాట ఆడే వాళ్లకు ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు. ఆ తరువాత అర్హులైన వాళ్లకు జాబ్స్ ఇవ్వలేదని కొంతమందినితెరమీదకు తెచ్చారు. వాళ్లంతా హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం అనర్హులని, ఐఎఎస్ అధికారులే ఆధారాలతో వివరించాక ఇప్పుడు ఎవరో ఒక ఉపాధ్యాయుడు తన సర్టిఫికెట్ బదులు ఇంకొకరి సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందాడని ఇదొక స్కామ్ అని ఆరోపిస్తున్నారు.
సర్టిఫికెట్లు సరిగ్గా వెరిఫై చెయ్యని అధికారి ఇందుకు బాధ్యుడవుతాడు. ప్రభుత్వం కూడా దాని మీద విచారణ చేయిస్తోంది. ఇలాంటి ఆరోపణలు, ప్రచారాలనుఅడ్డుపెట్టుకుని కొంతమంది మీడియా రిపోర్టర్లు కొత్తగా రిక్రూట్ అయిన ఉపాధ్యాయులని బెదరిస్తున్నారని, బ్లాక్మెయిల్ చేస్తున్నారని పేపర్లో వార్తలొచ్చాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో చక్రపాణిరెడ్డి అనే ఉపాధ్యాయుడిని సాక్షి టీవీ విలేకరులు బెదిరించారు, తరగతి గదిలోకి వెళ్లి విద్యార్ధుల ముందే చొక్కా పట్టుకుని నీ ధ్రువపత్రాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కు సంబంధించిన పత్రాలు చూపించాలని బెదిరించి, దౌర్జన్యం చేసినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అంతకుముందు బిగ్ టీవీ విలేకరి కూడా ఇదే విధంగా బెదిరించారని ఆయన చెప్తున్నారు. ఇతను సైన్యంలో హవల్దార్ గా చేశారు.
రిటైరయ్యాక బిఈడీ చేసి మెగా డిఎస్సీలో మాజీ సైనికుల, ఈడబ్ల్యుఎస్, క్రీడల కోటాలో హారిజాంటల్ రిజర్వేషన్ కింద ఉద్యోగం సాధించారు. కుప్పంలోనే కాదు, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కొంతమంది మీడియా ప్రతినిధులమని కొత్త ఎంపికైన టీచర్లు పనిచేసే స్కూళ్లకెళ్లి హడావుడి చేస్తున్నారు. కొన్ని చోట్ల బెదిరించి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సమాజంలో అన్ని రంగాలతో పాటు జర్నలిజంలో ప్రమాణాలు పడిపోయాయి. అక్షరమ్ముక్క రానివాడు కూడా జర్నలిస్టు అవతారమెత్తుతున్నాడు. ఒకప్పుడు జర్నలిజం కూడా సమాజసేవ లాంటి పవిత్రమైన వృత్తి గా భావించేవారు. విలేకరుల నుంచి యాజమాన్యాల వరకు జర్నలిజం ప్రమాణాలకు సంబంధించి అన్ రిటన్ లాస్ ని ఫాలో అయ్యేవారు. ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకత్వంలో కృష్ణా పత్రిక స్వాతంత్ర్యపోరాటంలో కీలక పాత్ర నిర్వహించింది. అలాగే కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి ఆంధ్రపత్రిక కూడా.
యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ లాంటి పత్రికలు జాతీయ స్థాయిలో స్వాతంత్ర్యపోరాటానికి ఊతమిచ్చాయి. స్వతంత్రం వచ్చాక ఇందిరాగాంధీ ఎమర్జన్సీ విధించినప్పుడు కఠినమైన ప్రెస్ సెన్సార్షిప్ అమల్లోకి తెచ్చింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పత్రిక యజమాని రామ్ నాథ్ గోయంకా ప్రభుత్వ ఆర్ధిక ఆంక్షలకులొంగకుండా పోరాడారు. ప్రముఖ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ ఎమర్జెన్సీని నిరసించినందుకు జైలుపాలయ్యారు. సి.ఆర్.ఇరానీ, కేఆర్ మల్కానీ లాంటి జర్నలిస్టులు జైళ్ల పాలయ్యారు. సమాజాన్ని చైతన్యపరచి, నిస్వార్ధంతో వార్తలు రాసే జర్నలిస్టులు, యాజమాన్యాలు రాను రాను తగ్గిపోయాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి.
మినిమం నాలెడ్జి లేనివాళ్లు మైకులు పట్టుకుని దేశం మీద పడుతున్నారు. బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు, వీళ్లకు కొంతమంది ప్రభుత్వోద్యోగులు, పోలీసుల సహకారం. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒక కొత్త అపార్ట్మెంట్ కడుతున్నారంటే, లేదా ఇల్లు కట్టుకుంటున్నాకూడా మామూళ్ల కోసం వేధిస్తున్నారు. ఇవ్వకపోతే మునిసిపల్ అధికారుల ద్వారా బెదిరిస్తారు. మా డబ్బులతో మేం ఇల్లు కట్టుకుంటూ వీళ్లకెందుకివ్వాలని వాళ్లు బాధపడుతుంటారు. యాజమాన్యాలకు తెలియకుండా కొందరు వసూళ్లు చేస్తారు. యాజమాన్యాల ఆదేశాలతోకొందరు బ్లాక్మెయిళ్లు చేస్తుంటారు. కొన్ని యాజమాన్యాలు బ్లాక్మెయిళ్ల కోసమే మీడియా సంస్థలను ఏర్పాటు చేస్తున్న దుస్థితి తెలుగు రాష్ట్రాల్లో వుంది. అలాగే ప్రకటనలివ్వకపోతే నెగెటివ్ వార్తలు రాసే సంస్కృతి పెరిగిపోయింది.
ఏదైనా ఒక వివాదాస్పద ఘటన జరిగితే చిలవలు పలవలు అల్లడం, దాన్ని ఆసరాగా చేసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడం నిత్యక్రుత్యం అయింది. గ్రుహప్రవేశాలకు పెళ్లిళ్లకు, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసేటప్పుడు హిజ్రాలకిచ్చే మొత్తాన్ని బడ్జెట్లో పెట్టుకున్నట్టు, జర్నలిస్టులకు కూడా కొంత పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ డిఎస్సీని వైసిపి వివాదాస్పదం చేశాక కొంత మంది ఇదే సందని రెచ్చిపోతున్నారు. కొంతమంది యాజమాన్యాల ఆదేశాలతో హడావుడి చేసి కొత్త ఉపాధ్యాయులని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రెస్ కార్డు చూపించి అడ్డగోలు పనులు చేసేవాళ్ల మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా అందరు జర్నలిస్టులు చేస్తున్నారని చెప్పడం లేదు. ఇంకా చాలా మంది వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేసేవాళ్లున్నారు. కానీ వసూల్ రాజాల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది.







