అంతా నీ వల్లే, ఇంచార్జ్ సతీష్ రెడ్డిపై జగన్ ఫైర్..?

0
8

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కడప జిల్లా రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా తిరుగులేని కంచుకోటగా ఉన్న కడప గడ్డపై.. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీగా ఏకగ్రీవాలు సాధించడం సంచలనంగా మారింది. ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలో సైతం అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి భయపడటం, చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంపై వైసీపీ అధిష్టానం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.

ఈ వరుస పరిణామాలపై స్పందించిన పార్టీ అధినేత వైఎస్ జగన్.. పులివెందుల నియోజకవర్గ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న లోకల్ కీలక నేత, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సతీష్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో సీరియస్ అయినట్లు పార్టీ అంతర్గత వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతోంది. పులివెందులలో గతంలో దశాబ్దాల పాటు వైఎస్ కుటుంబంపై టీడీపీ తరఫున ఒంటరి పోరాటం చేసి, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల ముందే వైసీపీలో చేరిన సతీష్ రెడ్డికి జగన్ నియోజకవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించారు.

అయితే ఈ స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో సతీష్ రెడ్డి ఆశించిన స్థాయిలో క్యాడర్‌ను నడిపించలేకపోయారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్. సొంత నియోజకవర్గమైన పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోనే సగం వార్డులను తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం జగన్ అసంతృప్తికి ప్రధాన కారణమైంది. అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వెనకడుగు వేస్తుంటే స్థానిక నాయకత్వం ఏం చేస్తోందని, పులివెందుల లాంటి సొంత గడ్డపైనే ఇలాంటి పరిస్థితి రావడం పార్టీ పరువును దెబ్బతీస్తోందని సతీష్ రెడ్డిని జగన్ నిలదీసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.

మరోవైపు ఈ ఏకగ్రీవాలు, వైఫల్యాలపై వైసీపీ శ్రేణుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికార కూటమి నేతలు, పోలీసులు అక్రమ హౌస్ అరెస్టులు, బెదిరింపులతో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని సతీష్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు బహిరంగంగానే ఆరోపించారు. పులివెందుల పరిధిలోని వేముల, వేంపల్లి వంటి మండలాల్లో పార్టీ శ్రేణులపై తీవ్ర ఆంక్షలు విధించారని వారు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, కడప జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలను కూటమి పూర్తిగా ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం, పులివెందులలో సగం వార్డులు చేజారిపోవడం జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర అసహనాన్ని కలిగించిందన్నది నగ్నసత్యం. ఈ ఊహించని రాజకీయ సంక్షోభం తర్వాత కడప జిల్లాలో పార్టీ పట్టును తిరిగి నిలబెట్టుకోవడానికి జగన్ స్వయంగా గ్రౌండ్ యాక్షన్‌ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.