ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా విజయవాడ పటమట గురునానక్ కాలనీకి చెందిన 81 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఇంజినీర్ బొప్పన బాపారావును డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించిన కేటుగాళ్లు ఏకంగా రూ. 10.25 కోట్లు కాజేశారు. సెప్టెంబర్ 20న ముంబయి పోలీసులు, సీబీఐ అధికారుల పేరుతో బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, ఆయన పేరుతో ముంబయిలో ఒక బ్యాంకు ఖాతా తెరిచారని, దాని ద్వారా హవాలా మార్గంలో ఉగ్రవాదులకు మనీలాండరింగ్ జరిగిందని నమ్మించారు. అనంతరం వీడియో కాల్ చేసి ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తున్నామంటూ తీవ్ర భయాందోళనలకు గురిచేశారు.
నిందితుల బెదిరింపులకు భయపడిన రిటైర్డ్ ఇంజినీర్, తన వద్ద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసుకుని కృష్ణలంక కెనరా బ్యాంకు ఖాతా ద్వారా నాలుగు విడతల్లో మొత్తం రూ. 10.25 కోట్లను వారు సూచించిన ఖాతాలకు బదిలీ చేశారు. అయితే, కేటుగాళ్లు ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు సెప్టెంబర్ 29న విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి, నిందితుల ఖాతాల్లోని సుమారు రూ. 7.25 కోట్ల నగదును ఫ్రీజ్ చేయించి, బాధితుడి ఖాతాకు జమయ్యేలా కృషి చేశారు.
ఈ సంచలన కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు వేరే కేసులో అరెస్టు చేసిన ఐదుగురు అంతర్రాష్ట్ర నిందితులకు ఈ దోపిడీతో సంబంధం ఉన్నట్లు తేలింది. వీరిలో అనిష్ ఖాన్, రెహ్మాన్, ఐజర్ ఆలం సహా కీలక నిందితులను విచారణ నిమిత్తం విజయవాడకు తీసుకువచ్చి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సైబర్ ముఠాకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లింకులు ఉండటం, భారీ స్థాయిలో హవాలా లావాదేవీలు జరగడంతో కేసు దర్యాప్తును మరింత లోతుగా జరిపేందుకు దీనిని కేంద్ర దర్యాప్తు సంస్థ.. సిబిఐకి అప్పగించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ నిర్ణయించారు.














