ఆన్‌లైన్ పరిచయాలు, డేటింగ్ యాప్ ప్రేమకథలు ఒక్కోసారి ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. తాజాగా హర్యానా, రాజస్థాన్ కేంద్రంగా ఇలాంటిదే ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని పానీపత్‌కు చెందిన 31 ఏళ్ల నితిన్ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. దాదాపు ఏడాది క్రితం అతడికి ఓ డేటింగ్ యాప్ ద్వారా కెనడాకు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. రోజువారీ చాటింగ్‌లతో మొదలైన వీరి స్నేహం క్రమంగా బలమైన ప్రేమ బంధంగా మారింది. చివరకు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.
తన ప్రియుడిని వివాహం చేసుకునేందుకు ఆ కెనడా మహిళ నవంబర్ 11న టూరిస్ట్ వీసాపై ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. నితిన్ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆమెను సాదరంగా ఆహ్వానించాడు. అక్కడి నుంచి ఆమెను రాజస్థాన్‌లోని నీమ్రానాలో ఉన్న తన బంధువుల ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. రెండు రోజుల పాటు ఇద్దరూ అక్కడే ఉన్నారు. అయితే పెళ్లి ప్రస్తావన వచ్చిన సమయంలో ఆమె అసలు వయసు 61 ఏళ్లు అని నితిన్‌కు తెలిసింది. తనకంటే దాదాపు రెట్టింపు వయసున్న మహిళ అని తెలుసుకుని ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన నితిన్, ఈ వివాహానికి ససేమిరా అన్నాడు.
పెళ్లికి నితిన్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ నవంబర్ 13న నేరుగా కెనడా ఎంబసీని ఆశ్రయించి తన పరిస్థితిని వివరించింది. ఎంబసీ అధికారుల సమాచారంతో వెంటనే అప్రమత్తమైన నీమ్రానా పోలీసులు తెల్లవారుజామున ఫ్లాట్ వద్దకు చేరుకుని ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు నితిన్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. మరోవైపు, కెనడా మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి కోట్‌పుట్లీలోని సంరక్షణ కేంద్రానికి తరలించామని, ఆమెను సురక్షితంగా తిరిగి కెనడా పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.














