గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దర్యాప్తు సంస్థల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. దానికి నిరాకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, కావాలంటే కింద కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలంటూ ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డికి న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి అరెస్ట్‌కు లీగల్‌గా మార్గం సుగమమైంది. మద్యం రవాణా టెండర్ల అక్రమాలు, నకిలీ షెల్ కంపెనీల ద్వారా జరిగిన మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈయన పాత్రపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించాయి.
ఏపీ ప్రభుత్వం ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ప్రాసిక్యూషన్‌కు పీఎంఎల్‌ఏ చట్టం కింద జీవో జారీ చేసిన 24 గంటల్లోనే ఢిల్లీ స్థాయిలో ఈ పరిణామం జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో, దర్యాప్తు సంస్థలు ఎప్పుడైనా కిరణ్‌కుమార్‌రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉండటంతో, ఈ మద్యం కుంభకోణంలో మరో కీలక అరెస్ట్ నమోదు కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.














