ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష నియామకం పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకోవడంతో ఖాళీ అయిన ఈ స్థానంలో జగన్ మోహన్ రెడ్డి అనూషను రంగంలోకి దించారు. అయితే, పైకి సాధారణ రాజకీయ వారసత్వ నియామకంలా కనిపిస్తున్న ఈ వ్యవహారం వెనుక బొత్స కుటుంబంలో తీవ్ర అంతర్మథనం నడిచిందనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కేవలం అధినేత జగన్ నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి వల్లే బొత్స సత్యనారాయణ ఈ ప్రతిపాదనకు అంగీకరించాల్సి వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం భీమిలి ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు, బొత్స సత్యనారాయణకు మధ్య ఉన్న దశాబ్దాల కాలం నాటి అంతర్గత బంధమేనని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వీరిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా అత్యంత సన్నిహిత మిత్రులు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన ఈ ఇద్దరు ఉద్దండులు.. బహిరంగంగా ప్రజాక్షేత్రంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్న సందర్భాలు చాలా అరుదు.
ఒక రకంగా చెప్పాలంటే, ఉత్తరాంధ్ర పొలిటికల్ ఈక్వేషన్స్‌ను స్క్రీన్ వెనుక ఉండి నడిపించడంలో వీరిద్దరి మధ్య ఒక అవగాహన ఉంటుందనే ప్రచారం ఉంది. అలాంటి ప్రాణస్నేహితుడు, రాజకీయంగా భీమిలిలో 92 వేల భారీ మెజార్టీతో తిరుగులేని శక్తిగా ఉన్న గంటా శ్రీనివాసరావుపై.. ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల అనుభవం లేని తన కుమార్తెను జిల్లా దాటించి మరీ బరిలోకి దించడం బొత్స సత్యనారాయణకు అస్సలు ఇష్టం లేదని సమాచారం. చిన్న శ్రీను ఎగ్జిట్ తర్వాత గుడివాడ అమర్నాథ్ లాంటి పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ, గంటాను ఢీకొట్టే ఆర్థిక, సామాజిక అంగబలం ఒక్క బొత్స కుటుంబానికే ఉంటుందని జగన్ గట్టిగా నమ్మారు.
బొత్స నిరాకరిస్తున్నప్పటికీ, పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి అనూష నియామకమే ఏకైక మార్గమని జగన్ పట్టుబట్టడంతో బొత్స చివరకు తలొగ్గక తప్పలేదని భోగట్టా. భీమిలి తీరంలో దాదాపు మూడున్నర లక్షల మంది ఓటర్లు ఉన్న పెద్ద నియోజకవర్గంలో కేవలం కుటుంబ నేపథ్యంతో గంటా పొలిటికల్ స్ట్రాటజీని తట్టుకోవడం అంత సులువు కాదు. ఒకవైపు మిత్రత్వ బంధాన్ని కాపాడుకుంటూనే, మరోవైపు జగన్ అప్పగించిన పార్టీ బాధ్యతలను మోస్తూ, కుమార్తె రాజకీయ భవిష్యత్తును ప్రజాక్షేత్రంలో బొత్స ఎలా తీర్చిదిద్దుతారనేది ఇప్పుడు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న అంశం.














