Home క్రీడలు రాజకీయాల్లోకి మహమ్మద్ షమీ..?యూపీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం..?

రాజకీయాల్లోకి మహమ్మద్ షమీ..?యూపీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం..?

0
7

అంతర్జాతీయ క్రికెట్‌లో తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దిల్లీలో ఆయన రాష్ట్రీయ లోక్ దళ్ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌధరితో సమావేశం కావడమే ఈ తాజా రాజకీయ చర్చకు కారణమైంది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుండటంతో షమీ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.

త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్రోహా నియోజకవర్గం నుంచి ఆర్‌ఎల్‌డీ తరఫున మహమ్మద్ షమీ లేదా ఆయన కుటుంబ సభ్యులలో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. షమీ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా కావడంతో, ఆ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఆయన బీజేపీ తరఫున బెంగాల్ నుంచి పోటీ చేస్తారనే లీకులు వచ్చినప్పటికీ, అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు.

ప్రస్తుతం జయంత్ చౌధరితో జరిగిన ఈ తాజా భేటీపై అటు మహమ్మద్ షమీ కానీ, ఇటు ఆర్‌ఎల్‌డీ పార్టీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, గతంలో ఆయన రాజకీయ ప్రవేశంపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి తన దృష్టి క్రికెట్ పైనే ఉందని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదని హింట్ ఇచ్చారు. ఒకవేళ ఈ ప్రచారం నిజమై షమీ గనుక నేరుగా రాజకీయ రణరంగంలోకి దూకితే, మైదానంలో యార్కర్లతో బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేసినట్లే, రాజకీయ పిచ్‌పై కూడా ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు క్రీడా, రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.