అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్‌కు అతి సమీపంలో కాల్పుల మోత మోగడం తీవ్ర కలకలం రేపింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో లోగాన్ సర్కిల్ ప్రాంతంలోని ‘వీడా ఫిట్‌నెస్’ జిమ్‌లో ఒక సాయుధుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వైట్ హౌస్‌కు కేవలం ఒక మైలు దూరంలోనే ఈ దాడి జరగడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఏదైనా కుట్ర జరిగిందా అనే అనుమానాలు ఒక్కసారిగా వ్యాపించాయి.
సమాచారం అందిన క్షణాల్లోనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అయితే జిమ్ లోపల, బయట కాల్పులు జరిపిన నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని, అదే భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. దీంతో ప్రత్యేక స్వాట్ బృందాలు రంగంలోకి దిగి సుమారు గంటపాటు అతనితో చర్చలు జరిపాయి. చివరకు గది లోపల నుంచి ఒక్కసారిగా తుపాకీ శబ్దం వినిపించడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా, నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు సమీపంలోని పాఠశాలలకు లాక్‌డౌన్ విధించడంతో పాటు స్థానికులను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించాయి. ఎఫ్‌బీఐ, నేషనల్ గార్డ్ దళాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. కాగా, ఈ కాల్పుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు వైట్ హౌస్ అధికారులకు చేరవేశామని, అయితే అధ్యక్షుడు ట్రంప్ భద్రతకు ఎలాంటి ముప్పు లేకపోవడంతో వైట్ హౌస్ సెక్యూరిటీలో మార్పులు చేయాల్సిన అవసరం రాలేదని డీసీ మేయర్ మురియెల్ బౌజర్ స్పష్టం చేశారు. నిందితుడు ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.














