విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి కీలక అడుగు పడింది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన జాంటీ రోడ్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దే అంశంపై సుమారు అరగంట పాటు చర్చించారు.
ఈ భేటీ సందర్భంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ముక్కం బీచ్‌లో రూ. 55 కోట్ల పెట్టుబడితో భారీ పర్యాటక ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ముక్కం కోస్టల్ వెల్‌నెస్, సర్ఫ్ క్లబ్ సంస్థ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సదరు సంస్థ ప్రతినిధులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు జాంటీ రోడ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో పర్యాటక రంగానికి సరికొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. ముక్కం బీచ్‌లో ఏర్పాటు కానున్న ఈ వెల్‌నెస్ సెంటర్ మరియు సర్ఫ్ క్లబ్ ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా, సముద్ర ఆధారిత క్రీడలకు ప్రాధాన్యత లభించనుంది. జాంటీ రోడ్స్ వంటి అంతర్జాతీయ క్రీడా దిగ్గజం ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావడంతో, విశాఖ-భోగాపురం తీర ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.














