ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం వెనుక ఒక నిరుద్యోగి జీవిత కాల కష్టం ఉంటుంది. రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టి, ఎన్నో త్యాగాలు చేసి, తమ కుటుంబాల భవిష్యత్తును మార్చుకోవాలనే తపనతో ‘మెగా డీఎస్సీ-2025’ లో పోస్టులు సాధించారు వేలాది మంది అభ్యర్థులు. ముఖ్యంగా క్రీడా రంగంలో ఎంతో క్రమశిక్షణతో, కఠినమైన శిక్షణతో రాణించి, స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయుల బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంతో శ్రమ దాగి ఉంది. అలాంటిది, ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఈ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందనే ఆవేదన వ్యక్తమవుతోంది.
తీరా కష్టపడి ఉద్యోగం సాధించి, గౌరవంగా, ప్రశాంతంగా సమాజంలో బతకాలి అనుకుంటున్న తరుణంలో వైసీపీ సృష్టించిన వివాదాలు ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఆధారాలు లేని రాజకీయ ఆరోపణలు చేస్తూ, కోర్టుల చుట్టూ తిప్పుతూ, చివరకు విజయవాడ ‘శాప్’ కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న మహిళా ఉపాధ్యాయులు అని కూడా చూడకుండా భౌతిక దాడులకు తెగబడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
క్రీడల్లో ఎంతో క్రమశిక్షణ నేర్చుకుని, నిలకడగా రాణించి పారదర్శకంగా ఉద్యోగం సంపాదించుకున్న వారిని ఇలా రోడ్ల పైకి లాగి వేధించడం ఏంటని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పగ ప్రతీకారాల కోసం ఎంతో కష్టపడి కొలువులు సాధించిన అమాయక ఉపాధ్యాయులను బలిపశువులను చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిరుద్యోగ సమాజం మండిపడుతోంది. వైసీపీ చేస్తున్న ఈ అరాచక, దిగజారుడు రాజకీయాల వల్ల ప్రస్తుతం బాధితులైన ఉపాధ్యాయులపై ప్రజల్లో విపరీతమైన సానుభూతి పెరుగుతోంది. ప్రభుత్వం స్పందించి తమకు పూర్తి రక్షణ కల్పించాలని, తాము ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునే వాతావరణం కల్పించాలని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు.














