మోడీ సర్కార్ కు ఉక్కపోత, అసలేం జరుగుతోంది..?

0
7

కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి గండాలు ఒక్కొక్కటిగా చుట్టుముడుతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు మునుపెన్నడూ లేనంత బలంగా పార్లమెంట్‌లో గొంతు వినిపిస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా వరుసగా కీలక వివాదాలు తెరపైకి వస్తున్నాయి. అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారం, దేశాన్ని కుదిపేసిన నీట్ పేపర్ లీకేజీ వివాదం, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం చుట్టూ ముసురుకున్న ఆరోపణలు.. ఈ మూడు అంశాలు ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని తీవ్ర ఆత్మరక్షణలో పడేశాయి.

మొదటగా, అయోధ్యలో ప్రతిష్ఠాత్మకమైన రామమందిర నిర్మాణానికి సేకరించిన విరాళాల వినియోగం, ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు హిందూత్వ అజెండాతో ముందుకు వెళ్లే బీజేపీకి నైతికంగా పెద్ద సవాలుగా మారాయి. దీనికి తోడు, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షల పేపర్ లీకేజీ ఉదంతం మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది.

పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలు, పేపర్ లీక్ ముఠాల వెనుక కొందరు రాజకీయ నేతల హస్తం ఉందనే ఆరోపణలపై ఇటు సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం, అటు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి పోరాడటంతో కేంద్రం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు దెబ్బలు చాలవన్నట్లు, ఇప్పుడు ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి కేంద్ర ఎన్నికల సంఘం చుట్టూ రేగిన వివాదం బీజేపీపై ఒత్తిడిని పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ పేరుతో కోట్ల కొద్దీ ఓట్లను తొలగించారని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వస్తున్న కథనాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

విపక్ష ‘INDIA’ కూటమి ఈసీ తీరుపై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానానికి సిద్ధమవ్వడం, కాక్రోచ్ జనతా పార్టీ వంటి సంస్థలు వచ్చే ఏడాది జరగబోయే కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఢిల్లీ వేదికగా గట్టిగా పట్టుబడుతుండటంతో మోదీ సర్కార్‌ తీవ్ర వ్యూహాత్మక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ వరుస సంక్షోభాల నుండి బీజేపీ ఎలా గట్టెక్కుతుందనేది ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.