తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో అత్యంత సంచలన కోణం వెలుగులోకి వచ్చింది. కేవలం రాజకీయ ప్రత్యర్థుల కదలికలపై నిఘా పెట్టడానికే పరిమితం కాకుండా, ట్యాపింగ్ ద్వారా సేకరించిన రహస్య సమాచారాన్ని అడ్డం పెట్టుకుని బడా వ్యాపారవేత్తలను బెదిరించి భారీగా నిధులు వసూలు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. ముఖ్యంగా ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సిట్ అధికారుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలం ఈ మొత్తం కేసును కీలక మలుపు తిప్పబోతోంది.
సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన ఫోన్ సంభాషణలను అప్పట్లో అక్రమంగా ట్యాప్ చేశారు. ఆ సంభాషణల ద్వారా సేకరించిన సున్నితమైన సమాచారాన్ని చూపించి, ఆ వ్యాపారిని తీవ్రస్థాయిలో భయభ్రాంతులకు గురిచేసినట్లు దర్యాప్తులో తేలింది. విచారణ సంస్థల దాడులు, కేసులు తప్పించుకోవాలంటే తమ పార్టీకి భారీగా నిధులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ రియల్టర్ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పెద్ద మొత్తంలో సొమ్మును సదరు పార్టీ ఖాతాలో జమ చేసినట్లు తన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారు.
అక్రమ నిఘా వ్యవస్థను అడ్డం పెట్టుకుని సాగించిన ఈ వసూళ్ల పర్వంపై సిట్ అధికారులు పూర్తి స్థాయిలో సాంకేతిక, ఆర్థిక ఆధారాలను సేకరించారు. రియల్టర్ కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు, అవి పార్టీ ఖాతాలోకి వెళ్లిన తేదీలతో సహా పక్కా రికార్డులను సిద్ధం చేశారు. తుది ఛార్జిషీట్లో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన వాంగ్మూలాన్ని అత్యంత కీలక సాక్ష్యంగా పొందుపరచనున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన ఈ దందా కోర్టు విచారణలో నిందితులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది.














