మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడు (ఏ2) సునీల్ యాదవ్ చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ వ్యవహారంపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఒక సినిమాను మించిన ట్విస్ట్‌లు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో వస్తున్న తాజా పరిణామాలపై ‘గొడ్డలి పార్టీ’ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని, ఎందుకు స్పందించడం లేదని మంత్రి అనగాని నిలదీశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన పూర్తి వ్యూహం, ప్రణాళిక అంతా తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే జరిగిందని మంత్రి అనగాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ దారుణ హత్యలో అన్ని వేళ్లూ నేరుగా జగన్ కుటుంబం వైపే చూపిస్తున్నాయని మండిపడ్డారు. ఈ కేసులో లబ్ధి పొందింది జగన్, భారతి, అవినాష్ రెడ్డేనంటూ ఏ2 సునీల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై జగన్ మోహన్ రెడ్డి తక్షణమే సమాధానం చెప్పాలని, ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ పేరును ‘గొడ్డలి డైవర్షన్ పార్టీ’గా మార్చుకుంటే చాలా మంచిదని ఆయన తీవ్రంగా ఎద్దేవా చేశారు. నిజమైన బాధితులను నిందితులుగా చిత్రీకరించడం గొడ్డలి పార్టీకి మొదటి నుంచి అలవాటేనని మంత్రి అనగాని విమర్శించారు. కేవలం రాజకీయ పదవి, వందల కోట్ల డబ్బు కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టకుండా ఎంతకైనా తెగించటం జగన్ నైజమని ఆరోపించారు. ఒకవైపు దర్యాప్తు సంస్థల విచారణ ముగుస్తున్న తరుణంలో, సొంత మనుషులే నిజాలు ఒప్పుకుంటుంటే.. వైసీపీ లీడర్ షిప్ సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తోందని విమర్శించారు. వివేకా రక్తపు మరకల వెనుక ఉన్న అసలు శక్తులు త్వరలోనే చట్టానికి దొరికిపోతాయని మంత్రి అనగాని స్పష్టం చేశారు.














