వైసీపీ వర్సెస్ సాయిరెడ్డి.. ప్యాలెస్‌లో బుజ్జగింపుల దందా షురూ..?

0
4

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో పార్టీ మాజీ నంబర్-2, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీసుకోబోయే పొలిటికల్ స్టెప్స్ ఇప్పుడు తాడేపల్లి వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. దసరా తర్వాత సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు విజయసాయి రెడ్డి ఇప్పటికే అధికారికంగా స్పష్టం చేశారు. దీనికి తగ్గట్టుగానే ఆయన వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ వాయిస్ పెంచుతున్నారు. అయితే, ఈ కొత్త పార్టీ ఏర్పాటు వెనుక విజయసాయి రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.

వైసీపీలో ఒకప్పుడు అన్నీ తానై నడిపించిన విజయసాయి రెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం పెరగడంతో క్రమంగా పక్కన పెట్టబడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కంటే ఎత్తైన కుర్చీలో కూర్చుని పార్టీని నాశనం చేశారంటూ విజయసాయి రెడ్డి ఇటీవల బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఇదే లైన్‌ను తన కొత్త పార్టీ ఆపరేషన్‌కు అస్త్రంగా వాడుకుంటున్నారు. గత ఐదేళ్ల పాలనలో సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరి వల్ల తీవ్రంగా నష్టపోయి, అవమానాలు భరించి, ప్రస్తుతం వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి, అగ్ర శ్రేణి నాయకుల లిస్ట్‌ను విజయసాయి రెడ్డి సిద్ధం చేసుకున్నట్లు క్షేత్రస్థాయి సమాచారం.

“అక్కడ మీకు దక్కిన గౌరవం ఏంటో నాకు తెలుసు.. నాతో రండి, మీకు నేను పూర్తి భరోసా ఇస్తాను” అంటూ ఆ నాయకులకు విజయసాయి రెడ్డి నేరుగా లైన్ క్లియర్ చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఇటీవల రాయలసీమ కేంద్రంగా అనంతపురం జిల్లాలో విజయసాయి రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ తర్వాత ఈ ఆపరేషన్ మరింత వేగం పుంజుకుంది. ఈ పర్యటనలో ఆయన టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా తన పార్టీ ఉండబోతుందని చెప్తూనే, తెరవెనుక రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గ అసంతృప్తి నేతలను టార్గెట్ చేసినట్లు సమాచారం.

వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్, లీడర్‌షిప్ ఉన్న రెడ్డి సామాజిక వర్గంలోనే చీలిక తెచ్చేలా విజయసాయి రెడ్డి పావులు కదుపుతున్నారు. సజ్జల బాధితులు, సామాజిక వర్గ సమీకరణలు కలవడంతో అనంతపురం, ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు కీలక నేతలు విజయసాయి రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వైసీపీ అధిష్టానానికి లీకులు అందాయి. ఈ వ్యవహారం కాస్తా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరడంతో వైసీపీ అధిష్టానంలో తీవ్ర అలజడి మొదలైంది.

ఒకవైపు ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని కాపాడుకోవడమే కష్టంగా మారిన తరుణంలో, విజయసాయి రెడ్డి రూపంలో సొంత సామాజిక వర్గ నేతలు చేజారిపోతే పార్టీ మనుగడకే ప్రమాదమని గుర్తించారు. దీంతో వైసీపీ పెద్దలు తక్షణమే డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు ఉపక్రమించారు. విజయసాయి రెడ్డి టచ్‌లోకి వెళ్లినట్లు అనుమానం ఉన్న అసంతృప్తి నేతలకు తాడేపల్లి నుంచి నేరుగా ఫోన్లు వెళ్తున్నాయి. గత ఐదేళ్లూ కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని లీడర్లను ఇప్పుడు అర్జంట్‌గా అమరావతిలోని కేంద్ర పార్టీ ఆఫీస్‌కు పిలిపించుకుంటున్నారు.

ఈ బుజ్జగింపుల పర్వంలో వైసీపీ అధిష్టానం సరికొత్త దౌత్యాన్ని ప్రయోగిస్తోంది. అసంతృప్తి నేతలతో అత్యంత ప్రేమగా మాట్లాడుతున్న పెద్దలు.. “మీకు ఏం కావాలో చెప్పండి, పార్టీలోనే అన్నీ చేసి పెడతాం.. గతంలో జరిగిన పొరపాట్లు ఇకపై జరగవు” అని హామీలు ఇస్తున్నారు. అంతటితో ఆగకుండా, ఎన్నికల ఖర్చులు మరియు గత ఐదేళ్ల కాలంలో ఆర్థికంగా దెబ్బతిన్న లీడర్లను గుర్తించి, “మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా..? ఆ గ్యాప్స్ కూడా మేమే పూర్తి చేస్తాం, తొందరపడి విజయసాయి రెడ్డి వైపు వెళ్లకండి” అంటూ గట్టి ఆఫర్లను ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైన నాయకులకు ఇప్పుడు సడన్‌గా వైసీపీ పెద్దలు ప్యాకేజీలు, ఆఫర్లు ఇస్తుండటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి, కూటమి ప్రభుత్వాన్ని తట్టుకోవడం ఒకెత్తయితే.. సొంత కుంపటి నుంచి ముంచుకొస్తున్న సాయిరెడ్డి గండాన్ని ఆపడం ఇప్పుడు వైసీపీకి అంతకంటే పెద్ద పరీక్షగా మారింది. తాడేపల్లి బుజ్జగింపులకు లీడర్లు లొంగుతారా..? లేక దసరా తర్వాత విజయసాయి రెడ్డి జెండా కిందకు చేరుకుంటారా..? అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.