గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఊపందుకోగా, శంకుస్థాపనలు వేగంగా జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకదాని వెంట ఒకటి ఇంత వేగంగా పనులు జరగడం లేదు. కేంద్రం నుంచి అందుతున్న సహకారం కూడా దీనికొక కారణంగా పరిశీలకులు చెప్తున్నారు. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన వెలుగొండ ప్రాజెక్టుని ప్రారంభించి, జాతికి అంకితం చేసింది మొదలు వరుస కార్యక్రమాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు హల్ చల్ చేస్తున్నారు. దీనికితోడు కేంద్రం పరిధిలోని కొన్ని ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు వస్తున్నాయి. ఆగస్టు 31 సీఎం వెలుగొండ ప్రాజెక్టుని ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు వల్ల మూడు జిల్లాలు, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లా వాసులకు ప్రయోజనం కలుగుతుంది. మెట్ట ప్రాంత నియోజకవర్గాల్లో సాగునీరు, తాగునీటి కష్టాలు తీరిపోతాయి. ఆ తరువాత రెండు రోజులకే పోలవరం ఎడమ ప్రధాన కాలువని ప్రారంభించారు. గోదావరి జలాలని ఉత్తరాంధ్రకి విడుదల చేశారు. ఈ కాలువ పొడవు 213 కిలోమీటర్లు, 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. రాష్ట్రంలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో రోడ్లు, తాగునీరు, సీవరేజ్ పనుల కోసం 12 వేల కోట్ల రూపాయలతో పట్టణాభివృద్ధి ప్యాకేజి ప్రకటించారు.
పల్లె పండుగ కార్యక్రమం కింద 11 వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా 6 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు వెయ్యబోతున్నారు. మదనపల్లెలో రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో హార్టికల్చర్ డెవలప్ చేసేందుకు, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ కు శ్రీకారం చుట్టారు. రాయలసీమని ఫ్రూట్ బౌల్ గా మార్చే ప్రక్రియలో భాగంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.
మదనపల్లెలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత రోజు గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద 3 లక్షల ఇళ్లనిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టు కింద 3డి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏపీకి ఇంకో 6 లక్షల ఇళ్లు మంజూరు చెయ్యాలని ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నిన్న కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ 2.0 పథకం కింద 30 వేల కోట్లతో జలధాన పనులని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామీన ప్రాంతాల్లో 27 లక్షల కుళాయి కనెక్షన్లు కొత్తగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 13 వేల ఓవర్ హెడ్ ట్యాంకులు, 77వేల కిమీ పైప్ లైన్ నిర్మాణం చేపడతారు. ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు చేస్తున్నారు. గతంలో జగన్మోహనరెడ్డి హయాంలో 2021, 22 సంవత్సరాల్లో జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం ఏపీకి 3,183 కోట్లు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 453 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులు మురిగిపోయాయి.
ఇది తెలుగుదేశమో, జనసేనో చేసిన ఆరోపణ కాదు. కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంటులో చెప్పారు. ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ చొరవతో కేంద్రం నుంచి పంచాయతీరాజ్ శాఖకి నిధులు ఉదారంగా వస్తున్నాయి. ఇవి కాకుండా రాజధాని అమరావతికి సంబంధించి రెండు డెవలప్మెంట్స్ జరిగాయి. 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు నేషనల్ హైవే అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగు ప్యాకేజిలకు టెండర్లు పిలిచింది. 30 వేల కోట్లతో ఈ ఒఆర్ఆర్ నిర్మాణం జరుగుతుంది. అమరావతికి రైల్వే కనెక్టివిటీ కోసం హైదరాబాద్ విజయవాడ మార్గంలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు రైలు మార్గం వేస్తున్నారు.
అమరావతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం చెయ్యబోతున్నారు. ఈ రైలు మార్గానికి సంబంధించిన టెండర్లు, భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాటుచేస్తున్న లక్ష కోట్లతో ఏర్పాటు చేస్తున్న రిఫైనరీకి పర్యావరణ ఆమోదం లబించింది. ఈ నెలలోనే ప్రధానమంత్రి చేతులమీదుగా దీనికి శంకుస్థాపన జరగబోతోంది. ఈ నెల రోజుల్లో ఖరారైన, శంకుస్థాపనలు జరిగిన ప్రాజెక్టుల విలువ దాదాపు 2 లక్షల కోట్లు. డెవలప్మెంట్, విజన్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యర్థులు సైతం హ్యాట్సాఫ్ చెప్పాలి అంటున్నారు అనలిస్ట్ లు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబుకు పోటీ లేదని, అందులోను ఇప్పుడు కేంద్రం నుంచి పుష్కలంగా సహకారం అందుతున్న నేపథ్యంలో ఏపీ అభివృద్ధి దూసుకుపోతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.














