ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాల మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల్లోని కీలక వైసీపీ నాయకులు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు క్యూ కడుతున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గతంలో స్థానికంగా ఉన్న తీవ్ర రాజకీయ వైరం కారణంగా వీరిలో చాలా మంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ నేతలందరికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఒక పక్కా ఆల్టర్నేటివ్‌గా కనిపిస్తోంది.
వైసీపీని వీడుతున్న నేతల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లీడర్‌షిప్‌పై నమ్మకం పూర్తిగా సన్నగిల్లిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ అధిష్టానం ఇస్తున్న పిలుపులు, చేస్తున్న కార్యక్రమాలు జనాల్లోకి వెళ్లడం లేదని, పైగా క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయని నేతలు వాపోతున్నారు. దీనికి తోడు ఢిల్లీ స్థాయిలో కూడా వైసిపికి అనుకూల వాతావరణం ఎక్కడా కనిపించకపోవడంతో, భవిష్యత్తు రాజకీయ మనుగడ కోసం లీడర్లు కండువాలు మార్చేందుకు డిసైడ్ అయ్యారు.
టీడీపీలోకి వెళ్తే స్థానిక సమీకరణాలు దెబ్బతింటాయని భావిస్తున్న వారంతా జనసేన గాజుగ్లాస్ ఆసరా కోసం చూస్తున్నారు. ఈ వలసల వ్యవహారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నుంచి వస్తున్న కీలక నేతలను చేర్చుకునే క్రమంలో.. మిత్రపక్షమైన టీడీపీకి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదా అసంతృప్తి కలగకుండా పవన్ ముందే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఏ నియోజకవర్గంలోనైనా వైసీపీ మాజీ ఎమ్మెల్యే లేదా కీలక నేత జనసేనలోకి రావాలనుకుంటే, అక్కడ ఉన్న టీడీపీ ఇన్‌ఛార్జ్ లేదా ఎమ్మెల్యేతో ముందే అంతర్గతంగా మాట్లాడుతున్నారు.
ఈ చేరికల వల్ల కూటమి అంతర్గత బలం పెరుగుతుందే తప్ప, పార్టీల మధ్య గ్యాప్ రాకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుతున్నారు. అటు వైసీపీని వీడాలి అనుకునే నేతల్లో ఎక్కువగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వారే ఎక్కువగా జనసేన వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసిపిని పూర్తిగా ఖాళీ చేస్తూనే, కూటమి ఐక్యతకు డ్యామేజ్ జరగకుండా జనసేన చేస్తున్న ఈ ‘సైలెంట్ ఆపరేషన్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.














