సీమలో వైఎస్ జగన్‌కు రెడ్ల మౌనం దెబ్బ..!

0
6

ఒకప్పుడు వైసీపీకి అత్యంత పటిష్టమైన బేస్ ఉన్న రాయలసీమ జిల్లాల్లో ప్రస్తుతం పార్టీని క్షేత్రస్థాయిలో నడిపించే సరైన సమన్వయకర్త లేదా బలమైన లీడర్‌షిప్ కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లాలను శాసించిన కీలక నేతలు ఇప్పుడు పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం దూకుడు మీదుంటే, మరోవైపు వైసీపీలో క్యాడర్‌ను ఏకతాటిపైకి తెచ్చి, వారిలో భరోసా నింపే ఒక సీనియర్ కోఆర్డినేటర్ లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్‌గా మారుతోంది.

2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాయలసీమలోని చాలా మంది రెడ్డి సామాజికవర్గానికి చెందిన కీలక నాయకులు, మాజీ మంత్రులు పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. గత ఐదేళ్ల పాలనలో జిల్లాల్లో చక్రం తిప్పిన కొందరు నేతలు.. ఓటమి తర్వాత కనీసం ప్రెస్ మీట్లు పెట్టడానికి లేదా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడటానికి కూడా ముందుకు రావడం లేదు. కొందరు నేతలు వ్యాపారాలు, వ్యక్తిగత కారణాల వల్ల పొలిటికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటే, మరికొందరు కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్న కేసుల భయంతో యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విధమైన సైలెన్స్ క్షేత్రస్థాయిలో పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోంది.

త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్‌ను సన్నద్ధం చేయడం వైసీపీ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. క్షేత్రస్థాయిలో గెలుపోటములను శాసించే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. స్థానికంగా ఉన్న లీడర్లు పట్టించుకోకపోవడంతో, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను వెతకడం కూడా కష్టంగా మారుతోంది. నాయకత్వం వహించాల్సిన వారే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో, క్యాడర్ వేరే పార్టీల వైపు చూసే ప్రమాదం ఉందనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

గతంలో జిల్లా బాధ్యతలను కొందరు పెద్దలకే అప్పగించి జగన్ నిశ్చింతగా ఉండేవారు. కానీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కేవలం కొద్దిమందిపైనే ఆధారపడితే సీమలో పార్టీ పట్టు పూర్తిగా జారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రాయలసీమ జిల్లాల నేతలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గాల వారీగా కొత్త సమన్వయకర్తలను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీని నమ్ముకున్న క్యాడర్‌కు భరోసా ఇవ్వకపోతే, రాబోయే రోజుల్లో కంచుకోటను కాపాడుకోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంత సులువు కాదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.