సజ్జల అనుచరుడి భార్యకు టీడీపీ మేయర్ సీటా..?

0
7

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలవడమే ఆలస్యం.. అధికార తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం జనరల్ మహిళ కేటగిరీకి దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. సిమ్స్ విద్యాసంస్థల అధినేత భరత్ రెడ్డి సతీమణి నాగ శిరీష పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారనే లీకులు ఇప్పుడు స్థానిక టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, విమర్శలను రేకెత్తిస్తున్నాయి.

గుంటూరు నగర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన నియోజకవర్గ స్థాయి నేతలు ఈ నిర్ణయంపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భరత్ రెడ్డి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ అగ్రనేత, సజ్జల రామకృష్ణారెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడిగా వ్యవహరించిన విషయాన్ని టీడీపీ తమ్ముళ్లు గుర్తుచేస్తున్నారు. “గత ఐదేళ్లు వైఎస్సార్‌సీపీ అరాచకాలను ఎదుర్కొని, అక్రమ కేసులు బరిస్తూ గుంటూరులో టీడీపీని బతికించిన మహిళా నేతలు ఎంతోమంది ఉండగా.. ఎన్నికల ముందు మాత్రమే పార్టీలోకి వచ్చిన వలస నేత కుటుంబానికి ఇంత పెద్ద పీఠం ఎలా కట్టబెడతారు..?” అని గ్రౌండ్ క్యాడర్ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తోంది.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ పంచన చేరి లబ్ధి పొంది, కూటమి గెలిచే సమయానికి జంప్ అయిన వారికి అయాచితంగా మేయర్ లాంటి ప్రతిష్టాత్మక అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం పార్టీ కోసం రక్తం చిందించిన నిజమైన కార్యకర్తలను అవమానించడమేనని స్థానిక నేతలు మండిపడుతున్నారు. 5 ఏళ్ళ పాటు తమను వేటాడిన నాయకుడికి సీటు ఎలా ఇస్తారని, ఇదేనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అధిష్టానం ఇచ్చే గౌరవం అంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని అధిష్టానం తక్షణమే పునరాలోచించుకోకపోతే క్షేత్రస్థాయిలో తాము ఎన్నికల ప్రచారానికి సహకరించే ప్రసక్తే లేదని, అవసరమైతే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రెబెల్ అభ్యర్థులను రంగంలోకి దించుతామని గుంటూరులో కాస్త పట్టుదలగా ఉన్నారనే టాక్ కూడా వినపడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.