Home క్రీడలు టీమిండియాలో గంభీర్ వన్-మ్యాన్ షో నడుస్తోందా..?

టీమిండియాలో గంభీర్ వన్-మ్యాన్ షో నడుస్తోందా..?

0
6

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ప్రస్తుత క్రికెట్ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సరికొత్త వివాదంలో చిక్కుకుంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి మూడు మ్యాచ్‌ల ప్లేయింగ్ ఎలెవన్ లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడంపై భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. యువ ప్రతిభను ప్రోత్సహించాల్సింది పోయి, నిరంతరం బెంచ్‌కే పరిమితం చేయడంపై వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రస్తుత టీమ్ మేనేజ్‌మెంట్ ఒక రకమైన ‘డిక్టేటర్‌షిప్’ నడుపుతోందంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మనీష్ ఓఝా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గంభీర్ మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “క్రికెట్ దిగ్గజాలు ఎవరిని అడిగినా ఒకటే చెబుతారు.. భవిష్యత్తు తరాన్ని సిద్ధం చేయాలంటే యువ ఆటగాళ్లకు మైదానంలో అవకాశాలు ఇచ్చి ఆడించాలి. అంతే కానీ కేవలం బెంచ్‌కే పరిమితం చేసి నీళ్లు మోయించడానికి ఇంతటి అద్భుతమైన ప్రతిభను జట్టులోకి ఎంపిక చేశారా..?” అని ఆయన నిలదీశారు.

మేనేజ్‌మెంట్‌లో ఉన్నవారికి తోచింది చేసుకుంటూ పోతున్నారని, ఈ పద్ధతి వల్ల యువ ఆటగాడిలో మానసిక అసంతృప్తి, నైరాశ్యం పెరిగి కెరీర్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గౌతమ్ గంభీర్ జట్టులో సూపర్‌స్టార్ కల్చర్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటానని ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. దేశీవాళీ క్రికెట్, ఐపీఎల్, అండర్-19 ప్రపంచకప్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సూర్యవంశీ లాంటి వినాశకర ఓపెనర్‌ను పక్కనబెట్టి, ఇప్పటికే స్థిరపడిన ఆటగాళ్లకే మళ్లీ మళ్లీ అవకాశాలు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సీనియర్లతో విభేదాలు, టెస్ట్ మ్యాచ్‌లలో పేలవమైన ఫలితాల వల్ల గంభీర్ కోచింగ్ శైలిపై ఇప్పటికే విమర్శలు వస్తుండగా.. ఇప్పుడు ఈ తాజా సెలెక్షన్ డ్రామా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.