తోపుదుర్తి నోటి దూల.. ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్..?

0
13

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయం రోజురోజుకూ దిగజారుతోంది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ నోటి దురుసును ప్రదర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జిల్లా పోలీసులపై అత్యంత అభ్యంతరకరమైన భాషలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సహనం కోల్పోయి, శాంతిభద్రతలను కాపాడే పోలీసులపై తీవ్రస్థాయిలో బూతుపురాణాన్ని అందుకున్నారు. “పోలీసులు ఖాకీ చొక్కాలు విడిచిపెట్టి వస్తే చెప్పులతో కొడతాం” అంటూ అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేస్తూ బహిరంగంగానే హెచ్చరించారు. అంతేకాకుండా, రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన నామినేషన్ల ప్రక్రియను రద్దు చేసి, మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణాన్ని చేజార్చుకుంటున్నామనే నైరాశ్యంతోనే తోపుదుర్తి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలకు దిగారంటూ స్థానిక ప్రజలు, సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేవలం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రమే కాకుండా.. ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి వైసీపీ అగ్ర నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పోలీసులపైనే తీవ్ర నిందలు వేస్తూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా జిల్లా పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పులివెందులలో వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ విమర్శించారు.

మరోవైపు ద్వారకా తిరుమలలో నామినేషన్ తిరస్కరణకు గురైన సందర్భంలో వైసీపీ మండలాధ్యక్షుడు ప్రతాపనేని వాసు పోలీసులతో బాహాబాహీకి దిగడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. సాక్షాత్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం గత నెలలో పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ.. అధికార యంత్రాంగం ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడానికే పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల పోరులో ఓటమి కళ్లముందు కనిపిస్తుండటంతో, తప్పులన్నీ పోలీసులపైకి నెట్టేసి బూతులతో రెచ్చిపోవడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని కూటమి నేతలు మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.