బెజవాడలో చేతులెత్తేసిన వైసీపీ లీడర్లు..!

0
9

ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఊహించని రాజకీయ సమీకరణాలకు వేదికగా మారింది. ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం జరుగుతున్న ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష కూటముల కంటే.. స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చుట్టూనే రాజకీయం ఎక్కువగా తిరుగుతోంది. అయితే, ఈ త్రిముఖ పోరులో ప్రధాన ప్రతిపక్షంగా నిలవాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో తీవ్ర వెనుకబాటుకు గురైనట్లు స్పష్టమవుతోంది. నిన్నటి వరకు మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ క్యాడర్, పోలింగ్ రోజున ఇంతలా డీలా పడిపోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఓ లుక్ వేద్దాం.

ఎన్నికల్లో ఏ పార్టీకైనా అత్యంత కీలకమైన ఘట్టం ‘ఓటర్ మొబలైజేషన్’ అంటే ఓటర్లను ఇళ్ల నుంచి పోలింగ్ బూత్‌లకు రప్పించడం. కానీ, విజయవాడలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి తరఫున క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన కీలక నేతలు ఈ విషయంలో పూర్తిగా విఫలమైనట్లు గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. గతంలో ఉన్న పట్టు, బూత్ స్థాయి నెట్‌వర్క్ ఎక్కడా కనిపించడం లేదు. ఓటర్ స్లిప్పుల పంపిణీ దగ్గర నుంచి బూత్‌ల వద్ద ఓటర్లకు అవసరమైన సదుపాయాలు చూసే విషయంలోనూ సమన్వయ లోపం స్పష్టంగా బయటపడింది. నాయకులు గ్రౌండ్‌లోకి రాకపోవడంతో క్యాడర్ సైతం స్తబ్దుగా ఉండిపోయింది.

గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన ఏబీవీకి నగరంలో ఉన్న క్లీన్ ట్రాక్ రికార్డును తక్కువ అంచనా వేయడం వైఎస్సార్సీపీ చేసిన పెద్ద తప్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచారంలో కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో పాటు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఓటర్లకు భారీగా డబ్బు పంచుతున్నారంటూ ఏబీవీ ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. “ఓటుకు నోటు” సంస్కృతిపై ఆయన చేసిన క్రూసేడ్ మధ్యతరగతి ఓటర్లను వైఎస్సార్సీపీకి దూరం చేసింది. అవినీతి రహిత పాలన నినాదంతో ఏబీవీ దూసుకుపోతుంటే, దానికి కౌంటర్ ఇచ్చే బలమైన అజెండాను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో వైసీపీ విఫలమైంది.

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జనసేనను వీడి వైఎస్సార్సీపీలోకి వచ్చిన పోతిన వెంకట మహేష్ లాంటి నేతలను పార్టీ సరిగ్గా వాడుకోలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఈ అంతర్గత విభేదాలు, ఈగో క్లాషెస్ వల్ల కీలకమైన డివిజన్లలో పార్టీ అభ్యర్థికి సొంత నేతలే వెన్నుపోటు పొడిచే పరిస్థితి వచ్చిందని, అందుకే పోలింగ్ రోజున ఆశించిన స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు చేయించలేకపోయారని నగర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.