జనసేనను వీడి ఎటూ కాకుండా పోయారా..?

0
11

రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అనే మాట మనం వింటూనే ఉంటాం. ఆ మాటను నిజం చేసాడో నేత. ఆయన పోతిన వెంకట మహేష్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీని ఒక రేంజ్‌లో నిలబెట్టిన నాయకుడిగా పోతిన వెంకట మహేష్‌కు బలమైన గుర్తింపు ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి, కొందరు చేసిన అంతర్గత వెన్నుపోటు రాజకీయాల వల్ల ఓడిపోయినప్పటికీ.. ఆయన ఎక్కడా జెండా దించలేదు. దాదాపు ఐదేళ్ల పాటు క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడి, అప్పటి వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిపై, అక్రమాలపై అలుపెరగని పోరాటం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అంటే పోతిన మహేష్ అనేంతగా క్యాడర్‌ను నిర్మించుకున్నారు.

అయితే, 2024 ఎన్నికల సమయానికి టికెట్ కేటాయింపులో పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో.. పోతిన మహేష్ ఎంతో ఆశపడిన విజయవాడ వెస్ట్ సీటును కూటమి ఒప్పందంలో భాగంగా బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి కేటాయించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని కష్టపడినా తనకు అన్యాయం జరిగిందనే తీవ్ర మనస్తాపంతో, అధినేత పవన్ కళ్యాణ్‌పై ఘాటు విమర్శలు చేస్తూ ఆయన ఏప్రిల్ 2024లో జనసేనను వీడి వైఎస్సార్సీపీలో చేరారు.

ఎవరినైతే తీవ్రంగా వ్యతిరేకించారో, ఎవరి అవినీతిపైన అయితే రోడ్డెక్కి కొట్లాడారో.. చివరకు అదే వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కన కూర్చోవాల్సి రావడం పోతిన మహేష్ రాజకీయ జీవితంలో ఒక పెద్ద మలుపుగా మారింది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆయన.. ఇప్పుడు జరుగుతున్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల వేళ మళ్లీ చర్చల్లోకి వచ్చారు. “ఒకవేళ ఆయన ఆవేశపడకుండా జనసేనలోనే ఉండి ఉంటే.. ఈరోజు కూటమి తరఫున విజయవాడ మేయర్ అభ్యర్థిగానో లేదా అంతకంటే పెద్ద పదవిలోనో ఉండేవారు” అంటూ స్థానిక ఓటర్లు, పాత జనసేన క్యాడర్ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. వైసీపీలోకి వెళ్లిన చాలా మంది నేతల పరిస్థితిలాగే, మహేష్ కూడా అక్కడ ఇమడలేక, ఇటు పాత పార్టీని వదులుకుని ఎటు కాకుండా మిగిలిపోయారనే సానుభూతి, విమర్శలు ఒకేసారి వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.