అరవింద్ కేజ్రీవాల్‌ ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..!

0
5

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కరడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో హత్య బెదిరింపులు రావడం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. రూ.7 కోట్లు ఇవ్వకపోతే కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్‌ను కూడా చంపేస్తామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆప్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని తిలక్ నగర్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌కు విదేశీ లింకులు ఉన్నట్లు చెప్పుకునే ఒక వ్యక్తి నుండి బెదిరింపు ఫోన్ కాల్, వాట్సాప్ మెసేజ్ వచ్చాయి. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, రూ.7 కోట్లు డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్, ఆయన కుమార్తె ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ నవంబర్ 6న పంజాబ్‌లోని మొహాలీ ఎస్‌ఎస్‌పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు మొహాలీ పోలీసులు భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్‌కు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు ఉపయోగించిన మొబైల్ నంబర్ ఆధారంగా కాల్ రికార్డులు, ఐపీ లాగ్స్ మరియు లొకేషన్ వివరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులకు తక్షణమే భద్రతను మరింత పెంచాలని ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పోలీసులను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.