22.5 C
Vijayawada
Sunday, November 22, 2026
Home ఆంధ్రప్రదేశ్ ఇది రెండున్నరేళ్ల పాలనకు ప్రజలిచ్చిన తీర్పు: సీఎం చంద్రబాబు

ఇది రెండున్నరేళ్ల పాలనకు ప్రజలిచ్చిన తీర్పు: సీఎం చంద్రబాబు

0
5

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన అఖండ విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శనివారం అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం, పరిషత్ ఎన్నికల్లో ఏకంగా 96.4 శాతం స్ట్రైక్ రేట్ సాధించి కూటమి చరిత్ర సృష్టించిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కూటమికి అండగా నిలిచారని, ఎన్నికల్లో గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

గత ఎన్నికలతో పోలిస్తే కూటమికి ఓట్ల శాతం కూడా భారీగా పెరిగిందని, గతంలో ఈవీఎంలపై విమర్శలు చేసిన వారికి ఇప్పుడు బ్యాలెట్ పేపర్లతో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు గట్టి సమాధానం చెప్పాయని విమర్శించారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా విజయం కూటమిదేనని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు, ప్రతిపక్ష వైసీపీ గతంలో సాధించిన 39.8 శాతం ఓట్లలో ఇప్పుడు 6 శాతానికి పైగా ఓట్లను కోల్పోయిందని చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. ఇది గడిచిన రెండున్నరేళ్ల కూటమి సుపరిపాలనకు ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పుగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీలు, మహిళలకు అత్యధిక సీట్లు కేటాయించామని తెలిపారు. కూటమి పార్టీలు ఐకమత్యంగా ఉన్నప్పుడే ఇలాంటి అద్భుత ఫలితాలు వస్తాయని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో అన్ని సీట్లు గెలవాలని పిలుపునిచ్చారు. తమ పార్టీలో ఎప్పుడూ ‘కార్యకర్తే అధినేత’ అని, కార్యకర్త లేకపోతే నాయకులే లేరని చంద్రబాబు పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన ఆయా సామాజిక వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత స్థానం కల్పించామని చెప్పారు. రాజకీయాల్లో కొత్త నాయకత్వం ఎదగాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో కొత్త వారికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చామన్నారు. అభ్యర్థుల ఎంపికలో కేవలం డబ్బు, పలుకుబడి కాకుండా చదువు, మంచి ప్రవర్తన, పార్టీ పట్ల అంకితభావం, విధేయతలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.