కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్ర పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారి భక్తుల కోసం అత్యంత కీలకమైన, విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించారు. తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులతో నిర్వహించిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికీ ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు.
ఈ నూతన విధానం ద్వారా తిరుమల యాత్రలో భక్తుడు ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే, వారి కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందుతుందని స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయ విశిష్టతను, చరిత్రను ప్రతిబింబించేలా రూ. 104 కోట్ల భారీ వ్యయంతో అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దిన ‘శ్రీ వేంకటేశ్వర మ్యూజియం’ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించారు. ఈ అంతర్జాతీయ స్థాయి మ్యూజియం భవిష్యత్తు ఐదేళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ట్రస్ట్‌కు అప్పగించినట్లు వెల్లడించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమల కొండపై కాలుష్యాన్ని అరికట్టేందుకు, భక్తుల ఉచిత రాకపోకల కొరకు రిలయన్స్ మరియు భారత్ బయోటెక్ సంస్థల సహకారంతో మొత్తం 44 అధునాతన ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతికి వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సరికొత్త హెల్త్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది.
తిరుపతిలోని ప్రముఖ ఆస్పత్రులైన స్విమ్స్, బర్డ్స్, రుయా, చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఒకే గొడుగు కిందికి అనుసంధానించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమగ్ర అనుసంధాన ప్రక్రియ ద్వారా తిరుమల తిరుపతి పరిధిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచి, కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు ఉచితంగా అందేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.














