బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మోపిదేవి శ్రీనివాసరావుపై వైసీపీ అధిష్ఠానం తీవ్ర క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీలో చేరి కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతోంది. 2024 ఎన్నికల తర్వాత పార్టీలో చేరికలు జరుగుతున్నాయని జనాల్లో ప్రచారం చేసుకోవడానికి, గత మే 14న తాడేపల్లి ప్యాలెస్‌లో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. ‘మోపిదేవి మన కుటుంబ సభ్యుడని, భవిష్యత్తులో చట్టసభల్లో కుర్చీ వేసి కూర్చోబెడతానని’ భారీ హామీలు కూడా ఇచ్చారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో కేడర్‌ను కాపాడుకునే వ్యూహంలో భాగంగానే ఈ చేరికను అప్పట్లో వైసీపీ హైలైట్ చేసింది.
కానీ, సీన్ కట్ చేస్తే కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే కథ అడ్డం తిరిగింది. పార్టీలో చేరినప్పటి నుండి మోపిదేవి శ్రీనివాసరావు స్థానిక నాయకత్వంతో విభేదిస్తూ, అంతర్గతంగా పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రేపల్లె నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు, క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. చేరిన నాలుగు నెలలకే ఇంతటి ఘోర అవమానంతో సస్పెన్షన్‌కు గురికావడం ఇప్పుడు రేపల్లె రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.














