Home ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో చిన్న శ్రీను మార్క్ మ్యూజిక్ స్టార్ట్..!

విజయనగరంలో చిన్న శ్రీను మార్క్ మ్యూజిక్ స్టార్ట్..!

0
4

విజయనగరం జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాదులు కదులుతున్నాయి. జిల్లాలో పార్టీకి తిరుగులేని వ్యూహకర్తగా పేరున్న చిన్న శ్రీను.. ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి తన రాజకీయ మార్క్ మ్యూజిక్ ప్రారంభించడంతో వైకాపా క్షేత్రస్థాయి బలాన్ని పూర్తిగా కోల్పోతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి జిల్లాలో పార్టీని ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

ఇందులో భాగంగానే తాజాగా చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, ఆమె భర్త వలిరెడ్డి శ్రీనివాసులు నాయుడు వైకాపాకు అధికారికంగా గుడ్‌బై చెప్పారు. తమ రాజీనామా లేఖలను వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఈ రాజీనామా కేవలం ఒక సాధారణ పరిణామం కాదు, విజయనగరం జిల్లా వైకాపా కోటను బద్దలు కొట్టే వ్యూహాత్మక అడుగు. రాజీనామా చేసిన శ్రీనివాసులు నాయుడు జిల్లా ప్రసార కమిటీ విభాగ అధ్యక్షుడిగా పార్టీ సోషల్ మీడియా, ప్రచార బాధ్యతలను మోశారు.

క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న ఇటువంటి కీలక నాయకత్వం తప్పుకోవడంతో నియోజకవర్గాల్లో వైకాపా నెట్‌వర్క్ కుప్పకూలిపోతోంది. చిన్న శ్రీను తెరవెనుక నడిపిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు వైకాపాకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు భారీగా తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఒకప్పుడు బలంగా కనిపించిన విజయనగరం జిల్లాలో ఇప్పుడు కనీసం స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని దయనీయ స్థితికి వైకాపా చేరుకుంటోంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో వైకాపా గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. నాయకులు కేవలం పదవుల కోసమే కాకుండా పార్టీ అరాచక వైఖరి నచ్చకే బయటకు వస్తున్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చిన్న శ్రీను పొలిటికల్ స్కెచ్‌తో విజయనగరం జిల్లాలో వైకాపా చాప్టర్ ముగింపు దశకు చేరుకుందని, మున్ముందు మరిన్ని భారీ వికెట్లు పడటం ఖాయమని స్పష్టమవుతోంది. స్థానిక పోరు ముగిసేనాటికి జిల్లాలో వైకాపా బోర్డు తిప్పేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు కంచుకోటలా చెప్పుకున్న, విజయనగరంలోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా క్షేత్రస్థాయి ఉనికి ఏమౌతుందోననే భయం ఆ పార్టీ శ్రేణులను వెంటాడుతోంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.