సైబర్ అలర్ట్.. AI ఏజెంట్లపై కేంద్రం అలెర్ట్..!

0
6

భారత కార్పొరేట్ సంస్థల సైబర్ భద్రతకు సరికొత్త ముప్పు వచ్చిపడింది. పరిశోధన మరియు పరీక్షల దశలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు.. తమకు కేటాయించిన పరిమితులను దాటి భారత సంస్థల లైవ్ సిస్టమ్స్‌లోకి అనధికారికంగా చొరబడ్డాయని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ విభాగం ‘సెర్ట్-ఇన్’ హెచ్చరించింది. ఈ ఏఐ ఏజెంట్లు ఇంటర్నెట్ ద్వారా కంపెనీల రహస్య వ్యాపార రికార్డులను, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని పర్మిషన్ లేకుండానే చదివినట్లు వెల్లడైంది. ప్రభుత్వ భద్రతా సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో దేశీయ టెక్ రంగంలో కలకలం రేగుతోంది.

ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే.. ఏఐ ఏజెంట్లు తమ సిస్టమ్స్‌లోకి చొరబడి డేటాను యాక్సెస్ చేసిన విషయాన్ని ప్రభావితమైన ఏ ఒక్క భారత సంస్థ కూడా గుర్తించలేకపోయింది. ఓపెన్ ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్ వంటి ప్రముఖ అంతర్జాతీయ ఏఐ ల్యాబ్‌లు తమ అంతర్గత సమీక్షలలో ఈ భద్రతా లోపాలను కనుగొని, స్వచ్ఛందంగా భారత ప్రభుత్వానికి మరియు సదరు కంపెనీలకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. కోడింగ్ హిస్టరీలో భద్రత లేకుండా వదిలేసిన క్రెడెన్షియల్స్, క్లౌడ్ అకౌంట్లలో ఉన్న లోపాలు మరియు నిరుపయోగంగా ఉన్న పాత ఏపీఐల ద్వారా ఈ ఏఐ మోడల్స్ కంపెనీల నెట్‌వర్క్‌లలోకి సులభంగా చొచ్చుకుపోయాయని సెర్ట్-ఇన్ స్పష్టం చేసింది.

దీనికి తోడు మరో ప్రమాదకరమైన అంశాన్ని కూడా కేంద్ర సంస్థ కనుగొంది. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు బహిరంగంగా లభించే ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్‌ను ఉపయోగించుకుని భారత సంస్థలపై ఆర్థిక లాభాల కోసం దాడులు చేస్తున్నట్లు తేలింది. సాధారణంగా మానవ హ్యాకర్లు చేసే దాడుల కంటే ఈ ఏఐ టూల్స్ అత్యంత వేగంగా, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వ్యవస్థలను పూర్తిగా హ్యాక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ కంపెనీలు తమ సైబర్ సెక్యూరిటీని తక్షణమే ఆడిట్ చేసుకోవాలని, మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ను తప్పనిసరి చేయాలని, ఏవైనా సైబర్ దాడులు జరిగితే 6 గంటల లోపు ‘సెర్ట్-ఇన్’కు నివేదించాలని కేంద్రం నిబంధనలను విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.