అమరావతిలో జరుగుతున్న ‘8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు’ వేదికగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, సాప్ ఎండీ భరణిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డీఎస్సీ-2025’ ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై సోషల్ మీడియా మరియు కొన్ని వర్గాల నుండి జరుగుతున్న దుష్ప్రచారాన్ని, తప్పుడు వార్తలను ఈ ఇద్దరు మహిళా అధికారులు అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టారని సీఎం కొనియాడారు. వాస్తవాలను మీడియా ముఖంగా ప్రజలకు స్పష్టంగా వివరించినందుకు గానూ చంద్రబాబు వారికి సభాముఖంగా కితాబు ఇచ్చారు.
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పారదర్శకంగా, నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన భారీ నియామక ప్రక్రియపై విపక్షాలు లేదా కొన్ని శక్తులు కావాలని బురదజల్లే ప్రయత్నం చేసినప్పుడు అధికారులు వెనకడుగు వేయకుండా, ప్రజలకు అందులోని అసలు వాస్తవాలను ధైర్యంగా వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆ బాధ్యతను సదరు మహిళా అధికారులు ఇద్దరూ బాధ్యతాయుతంగా నిర్వర్తించి నిరుద్యోగుల్లో ఉన్న అపోహలను తొలగించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.














