క్యాన్సర్ మందుల, కొత్త రేట్లు ఎలా చెక్ చేసుకోవాలంటే..?

0
7

క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఖరీదైన వైద్య ఖర్చులతో సతమతమవుతున్న రోగులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ తీసుకున్న కీలక నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా 1,364 రకాల క్యాన్సర్ మందుల సవరించిన గరిష్ట చిల్లర ధరలు నవంబర్ 9 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. 137 క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్ పరిమితిని విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో, ఈ మందుల ధరలు 96.45 శాతం వరకు భారీగా తగ్గాయి.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ ధరల తగ్గింపు జరిగింది. నవంబర్ 8 నాటికి మొత్తం 85 ఫార్మాస్యూటికల్ కంపెనీలు 121 మందులకు సంబంధించిన 1,364 ఫార్ములేషన్ల కొత్త ధరలను ప్రకటించాయి. వీటిలో 679 బ్రాండ్లు తమ మందుల ధరలను ఏకంగా 50 శాతానికి పైగా తగ్గించాయి. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు ఏటా సుమారు రూ. 3,540.38 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గనుంది.

అంతేకాకుండా మరో 10 నుంచి 15 రకాల క్యాన్సర్ మందులు మార్కెట్లోకి వచ్చిన వెంటనే వాటిపై కూడా ఇదే తరహా ధరల నియంత్రణ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ధరల తగ్గింపు తర్వాత కీలకమైన క్యాన్సర్ మందులు ఇప్పుడు సామాన్యులకు చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ సంస్థకు చెందిన పాల్బోప్రో 125 ఎంజీ క్యాప్సూల్స్ ధర గతంలో రూ. 40,421.33 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ. 2,720 కి తగ్గింది.

అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో వాడే అర్విన్‌కేర్ ఫార్మా సంస్థకు చెందిన అబిరాన్ 250 ఎంజీ టాబ్లెట్ల ధర రూ. 41,250 నుంచి రూ. 3,218.23 కు దిగివచ్చింది. దేశంలోని అన్ని మెడికల్ షాపులు, ఆసుపత్రి ఫార్మసీలు తప్పనిసరిగా కొత్తగా నిర్ణయించిన ధరలకే మందులను విక్రయించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వినియోగదారులు మందుల ప్యాకెట్లపై ఉన్న కొత్త ధరను సరిచూసుకోవడంతో పాటు, ఫార్మా సహీ దామ్ మొబైల్ యాప్ లేదా జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ధరలను తనిఖీ చేసుకోవచ్చు. ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే ఫార్మా జన్ సమాధాన్ పోర్టల్‌లో గానీ, లేదా 1800-111-255 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి గానీ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.