గుంటూరు నగరంలో నిర్మిస్తున్న ప్రాంతీయ గ్రంథాలయానికి 20 కోట్ల రూపాయల భూరి విరాళం అందింది. ఒక లైబ్రెరీకి ఇంత పెద్ద విరాళం సంచలన వార్త అనిచెప్పాలి. బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన లైబ్రరీని ఆధునికరించాలని కేంద్ర మంత్రిపెమ్మసాని చంద్రశేఖర్ సంకల్పించారు. పాత భవనం స్థానంలో సెల్లార్ పార్కింగ్ తో పాటు ఆధునిక వసతులతో జిప్లస్ 2 భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
విద్యార్ధులకు, ఉద్యోగాలకు ప్రిపేరయ్యే నిరుద్యోగులకు ఇబ్బంది కలగకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఈ నిర్మాణాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఈ లైబ్రరీకి గ్లోబల్ కాఫీ కింగ్, కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్ర ప్రసాద్ 20 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. కాంటినెంటల్ కాఫీ ఫ్యాక్టరీ గుంటూరు సమీపంలోని దుగ్గిరాలలోనే వుంది.
చల్లా రాజేంద్రప్రసాద్ అనేక సేవాకార్యక్రమాలకు భూరి విరాళాలిస్తుంటారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కూడా 5 కోట్లరూపాయల విరాళం ప్రకటించారు. అనంతపురం జిల్లాకు చెందిన చల్లా రాజేంద్రప్రసాద్ చిన్నతనం నుంచి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన తండ్రి జస్టిస్ చల్లా కొండయ్య ఏపీ హైకోర్టు సిజెగా పనిచేశారు.



