ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామిక కళ తెచ్చేందుకు, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దేశ రాజధాని ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” నినాదంతో గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న ఆయన.. ఢిల్లీ వేదికగా ప్రఖ్యాత మల్టీనేషనల్ కంపెనీల అగ్రనేతలతో వరుస భేటీలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరిస్తూ, సరికొత్త ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకురావడమే అజెండాగా లోకేష్ సాగించిన చర్చలు ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
పెట్టుబడుల వేటలో భాగంగా మంత్రి నారా లోకేష్ ప్రఖ్యాత గోద్రెజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు గోద్రెజ్ సంస్థ భాగస్వామ్యం ఎంతో అవసరమని లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్తగా గోద్రెజ్ ఆగ్రో కెమికల్ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన కంపెనీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని లోకేష్ వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హిత ఇంధనాలకు డిమాండ్ పెరుగుతున్న వేళ, ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు లోకేష్ మరో కీలక అడుగు వేశారు. అంతర్జాతీయ ఎరువులు మరియు కెమికల్స్ దిగ్గజం ‘యారా’ పబ్లిక్ ఎఫైర్స్ హెడ్ వైశాలి చోప్రాతో ఆయన భేటీ అయ్యారు. ఏపీ తీరప్రాంతం కల్పిస్తున్న అద్భుత అవకాశాలను వివరిస్తూ.. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా తయారీ మరియు ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. ఈ ప్రాజెక్ట్ గనుక కార్యరూపం దాల్చితే అంతర్జాతీయ స్థాయిలో కాకినాడ పోర్ట్ నయా రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
టెక్నాలజీ రంగంలో ఏపీని నెంబర్ వన్‌గా నిలిపేందుకు గ్లోబల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం శాప్ వైస్ ప్రెసిడెంట్ లవ్‌నీష్ చనానాతో మంత్రి లోకేష్ విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా ప్రజలకు అందించేందుకు సాంకేతికతను జోడించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్తగా “డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్” ను ఏర్పాటు చేయాలని శాప్ యాజమాన్యానికి లోకేష్ ప్రతిపాదించారు. ఢిల్లీ వేదికగా లోకేష్ సాగిస్తున్న ఈ హై-ప్రొఫైల్ చర్చలు మున్ముందు ఏపీకి సరికొత్త పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురాబోతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.














