రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, నిరుద్యోగుల కలలను నిజం చేస్తూ రికార్డు స్థాయిలో మెగా డీఎస్సీ ద్వారా భారీగా ఉద్యోగాలు ఇస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో అదే ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను కంటికి రెప్పలా కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో హోం శాఖ ఉండటంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో, వందలాది మంది పోలీసుల కళ్లెదుటే వైసీపీ రౌడీ మూకలు బారికేడ్లు ఎక్కి గురువులపై రాళ్లు, కోడిగుడ్లతో ఉన్మాద దాడులకు తెగబడటం శాంతిభద్రతల దౌర్భాగ్య స్థితికి అద్దం పడుతోంది.
ఈ ఘోర నిఘా వైఫల్యంపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్షేత్రస్థాయి కార్యకర్తలు తమ సొంత ప్రభుత్వంపైనే అత్యంత పవర్‌ఫుల్‌గా, నిలదీస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. గత వైకాపా అరాచక పాలనలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై గూండాలు పడి విరుచుకుపడినా, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై, కార్యకర్తల ఇళ్ళపై దాడులు చేసినా, చివరకు చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి వచ్చినా.. ‘మనం ప్రతిపక్షంలో ఉన్నాం, పోలీసులు వాళ్ల చేతుల్లో ఉన్నారు’ అని కార్యకర్తలు పళ్లు బిగువున పట్టి ఆ నాడు సరిపెట్టుకున్నారు.
కానీ, నేడు ప్రజలు బ్రహ్మరథం పట్టి కూటమికి అధికారం అప్పగిస్తే, మన సొంత ప్రభుత్వంలోనూ రౌడీల చేతుల్లో విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు రక్తం చిందించాలా అని కేడర్ రగిలిపోతోంది. ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ పాత ప్రభుత్వ అనుకూల అధికారుల చేతుల్లో ఉండి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంటే, పోలీస్ బాస్ కార్యాలయం ముందే ఇంతటి అరాచకం జరుగుతుంటే మనం అధికారంలో ఉన్నట్లా లేక పాత రోజుల్లోనే బతుకుతున్నట్లా అని సోషల్ మీడియాతో పాటుగా క్షేత్ర స్థాయిలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ భయానక వాతావరణాన్ని ఇలాగే వదిలేస్తే, త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున నిలబడటానికి అసలు ఏ కార్యకర్త ముందుకు వస్తాడనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రాష్ట్ర నడిబొడ్డున ఉన్న విజయవాడ కమిషనరేట్ వద్దనే నిన్న గుండాలు ఇంతలా రెచ్చిపోతే.. రేపు ఫ్యాక్షన్ పీడిత ప్రాంతాలైన రాయలసీమ జిల్లాల్లో గానీ, అత్యంత ఉద్రిక్తతలకు కేంద్రమైన పల్నాడు పల్లెల్లో గానీ సాధారణ కార్యకర్తలకు, పోటీ చేసే అభ్యర్థులకు అసలు రక్షణ ఎక్కడిది.? అనే ప్రశ్న వినపడుతోంది. క్షేత్రస్థాయిలో కేడర్‌కు భరోసా ఇవ్వాల్సిన హోం శాఖ, నిఘా విభాగం పాత అలసత్వాన్ని వీడకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, దాడి చేసిన రౌడీ మూకలపై, వారికి సహకరించిన లోపాయికారీ అధికారులపై పవర్‌ఫుల్ యాక్షన్ తీసుకోకపోతే కార్యకర్తల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు అని కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యాలయం మీద దాడులకు దిగిన రౌడీలే నిన్న టీచర్లపై దాడులు చేసి.. కెమెరాలకు, పోలీసులకు భయపడకుండా బహిరంగ వార్నింగ్ లు ఇస్తున్నారంటే ప్రభుత్వ వ్యవస్థపై భయం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.














