తెలంగాణలో భూముల రికార్డుల క్రమబద్ధీకరణ, వివాదాల పరిష్కారంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా పరిధిలోని ఎర్రవల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో భూముల తాజా పరిస్థితిపై అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ అధికారిక రికార్డుల ప్రకారం ఎర్రవల్లిలోని సర్వే నెంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉండాలని రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, క్షేత్రస్థాయిలో అధికారులు ఇటీవల నిర్వహించిన సర్వే నివేదికలను పరిశీలించగా, అక్కడ కేవలం 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. రికార్డులకు, క్షేత్రస్థాయి పరిశీలనకు మధ్య భారీ తేడా ఉండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో చూపిస్తున్న భూమికి, గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న భూమికి అస్సలు పొంతన లేకపోవడంతో.. మధ్యలో మాయమైన ఆ 45 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందో, ఎవరు ఆక్రమించారో తక్షణమే తేల్చాలని అధికారులను ఆదేశించారు.
ఇందులో ఎలాంటి అక్రమాలు జరిగాయో బట్టబయలు చేసేందుకు ఎర్రవల్లి, వెంకటాపూర్ గ్రామాల్లోని వివాదాస్పద భూములపై తక్షణమే సమగ్రమైన రీ-సర్వే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యులెవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో ఈ రీ-సర్వే వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.






